మద్యం కుటుంబాలను కుదిపేస్తోంది
పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఆవేదన చెందిన మహిళలు
మద్యనిషేధం చేస్తామని నమ్మించి మోసగించిన జగన్ కి ఈ సారి ఓటేసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ ని సీఎం చేసుకుంటామని స్పష్టం చేసిన మహిళలు
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిర్విరామంగా సాగిస్తున్న పవనన్న ప్రజాబాట ప్రతి ఇంటికీ తిరిగే కార్యక్రమం 21వ రోజున 3వ డివిజన్ పూర్తి చేసుకుని 4వ డివిజన్ లోకి ప్రవేశమైంది. స్థానిక మారుతి నగర్, కుందేళ్ళ ఫారం రోడ్డు ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించి వారి సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద పలువురు మహిళలు మద్యం కారణంగా తమ కుటుంబాల్లో ఏర్పడుతున్న సమస్యల గురించి వివరించి ఆవేదన చెందారు. గతంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్ తమ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తామని మాట ఇచ్చారని, అధికారం చేపట్టి సీఎం అయ్యాక మద్యపాన నిషేధం కాస్తా మద్యపాన నియంత్రణ అంటూ మార్చారని అన్నారు. పోనీ నియంత్రణ ఏమైనా చేస్తున్నారా అంటే లేదని, ప్రభుత్వ దుకాణాలను ఎక్కడపడితే అక్కడ ప్రారంభించారని, వాటికి తోడు ఎలైట్ షాపుల పేరుతో మరిన్ని దుకాణాలు తెచ్చి మద్యపానాన్ని పెంచి పోషిస్తున్నారని కేతంరెడ్డి ఎదుట మహిళలు వాపోయారు. గతంలో 80 రూపాయలు ఉండే చీప్ లిక్కర్ క్వాటర్ రేటు ఇప్పుడు 200 రూపాయలకు పైగా పెంచారని, పైపెచ్చు అది పిచ్చి మద్యం కావడంతో తమ భర్తలకు అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయని మహిళలు ఆవేదన చెందారు. ఇళ్లల్లో మగాళ్ళు మద్యం మానట్లేదని, దాంతో అధిక రేటుకి మద్యం కొని ఆర్ధిక సమస్యలు, పిచ్చి మద్యం తాగి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల పాలవుతూ తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేసారు. మద్యనిషేధం చేస్తామని నమ్మించి మోసగించిన జగన్ కి ఈ సారి ఓటేసే ప్రసక్తే లేదని ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడి జనసేన పార్టీకి ఓట్లు వేసి పవనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి మహిళలు స్పష్టం చేసారు.