ఏపీలో చిరు వ్యాపారులకు శుభవార్త: ఈ నెల 6న అకౌంట్లలో రూ. 10 వేలు జమ..
November 02, 2020
Chief Minister YS Jaganmohan Reddy is all set to launch the 'Jagannanna Todu' scheme on the 6th of this month.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 6వ తేదీన ‘జగనన్న తోడు’ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.
కరోనా సంక్షోభ సమయంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్న సీఎం జగన్ తాజాగా, పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 6వ తేదీన ‘జగనన్న తోడు’ పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసే ప్రక్రియ వేగవంతం చేశారు. వీధుల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటికి అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి బ్యాంకులకు పంపించే ప్రక్రియను గ్రామ, వార్డు వలంటీర్లు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు 8.9 లక్షల మంది చిరు వ్యాపారులను వడ్డీ లేని రుణాల కోసం లబ్ధిదారులుగా గుర్తించారు. వీరిలో 7 లక్షల మంది దరఖాస్తులను బ్యాంకులకు సమర్పించారు.
4.3 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ. 10 వేల చొప్పున రూ. 431 కోట్లను బ్యాంకులు వడ్డీ లేని రుణంగా మంజూరు చేశాయి. రుణానికి అర్హులైన చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. బ్యాంకులకు సమర్పించిన మిగతా దరఖాస్తులకు కూడా వీలైనంత త్వరగా వడ్డీలేని రుణాలు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఈ పథకాన్ని నవంబర్ 6వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
వీరంతా అర్హులు
గ్రామాలు లేదా పట్టణాల్లో 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని ఉండాలి.
రోడ్డు పక్కన, పుట్‌పాత్‌లపైన, ప్రజా, ప్రైవేట్ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న వారు
తలపై గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు కూడా అర్హులే.
సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే వారు.
చిరు వ్యాపారి వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో నెలకు రూ. 10 వేల లోపు, పట్టణాల్లో రూ. 12 వేల లోపు కలిగి ఉండాలి.
ఆధార్, ఓటరు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఇతర గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచి సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు బ్యాంకు అకౌంట్ లేని వారికి కొత్తగా పొదుపు అకౌంట్ ప్రారంభించేలా వలంటీర్లే తోడ్పాటు అందిస్తారు.