పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ సూచన
దిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు దాదాపు ఖరారయ్యాయి. వచ్చే నెలలో ఈ సమావేశాలు నిర్వహించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సూచించినట్టు సమాచారం. మొత్తం 18 రోజుల పాటు నిర్వహించనున్నారు. మరోవైపు, కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కోసం అధికారులు ఉభయసభల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతికదూరం నిబంధనలకనుగుణంగా సభ్యులకు సీట్లు కేటాయించనున్నారు.
ఈసారి ఉభయ సభల్లోనూ ఛాంబర్లు, గ్యాలరీలు సభ్యులకే సీట్లు కేటాయించనున్నారు. రాజ్యసభలో 60 మంది సభ్యులు ఛాంబర్‌లో; మరో 51మంది గ్యాలరీల్లో, మిగతా 132 మంది సభ్యులు లోక్‌సభలో కూర్చొనేలా ఏర్పాట్లు చేయడం భారత పార్లమెంట్ చరిత్రలో 1952 తర్వాత ఇదే తొలిసారి. అలాగే, ఇదే తరహా సీటింగ్ ఏర్పాట్లను లోక్‌సభలోనూ చేస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో భారీ తెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జులై 17న సమావేశమై పార్లమెంట్ సమావేశాల నిర్వహణ ఏర్పాట్లపై చర్చించారు. ఛాంబర్లు, గ్యాలరీలను సైతం సభ్యులు కూర్చొనేందుకు వీలుగా ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు చివరికల్లా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను వెంకయ్యనాయుడు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.