కరోనాతో ఇబ్బందిపడే పాత్రికేయులకు వైద్య సౌకర్యం కల్పించనున్న నోడల్ ఆఫీసర్లు
- సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి
కరోనాకు గురైన పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం అందించేందుకు జిల్లా కలెక్టర్ లచే ఒక ఆసుపత్రిని గుర్తించటం జరుగుతుందని, రాష్ట్ర స్థాయిలో సమాచార శాఖకు చెందిన నోడల్ అధికారిని, ప్రతి జిల్లాలో సమాచార శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధి, ఆ ఆసుపత్రిలో పాత్రికేయులకు వైద్య పరీక్ష నుంచి వైద్యం, అడ్మిట్ చేసుకునే వరకు సహాయకారిగా ఉంటూ అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు శ్రీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాత్రికేయులకు వైద్యం అందించేందుకు రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారిగా సమాచార శాఖ సంయుక్త సంచాలకులు పోతుల కిరణ్ కుమార్ ను నియమించామని, అదేవిధంగా ప్రతి జిల్లాలో సమాచార శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ప్రతినిధులను నోడల్ అధికారులుగా నియమించి వారి ఫోన్ నంబర్లను పాత్రికేయులకు అందుబాటులో ఉంచి ఎల్ల వేళలా వారికి సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా నేపధ్యంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు పాత్రికేయ సంఘాల ప్రతినిధులతో ఆరోగ్య శాఖ కమీషనర్ కాటమనేని భాస్కర్ తో కలసి ప్రత్యేక సంయుక్త సమావేశాన్ని గురువారం సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. ముందుగా కరోనా నేపధ్యంలో మృతి చెందిన 8 మంది పాత్రికేయుల కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ప్రతి జర్నలిస్ట్ ఒక సామాజిక డాక్టర్ గా మారి కరోనా పై సరైన సమాచారాన్ని అందించి, ప్రజల్లో అపోహలను తొలగించేందుకు తోడ్పాడాలని పిలుపునిచ్చారు. పాత్రికేయులు విధినిర్వహణలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుందని అలాంటి సందర్భంలో మాస్క్, శానిటైజర్ లు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మృత దేహాల విషయంలో కూడా అనేక అపోహలు ఉన్నాయని, మృత దేహంలో 4 నుంచి 6 గంటల కన్నా వైరస్ ఉండదన్నారు. దహన సంస్కారాల అనంతరం బూడిదలో కూడా వైరస్ ఉండదని, ఖననం ద్వారా భూగర్భ జలాలు కలుషితం అవ్వవని ప్రజలలో పాత్రికేయలు చైతన్యం తీసుకురావాలన్నారు. కరోనా పట్ల ఎవరూ భయపడరాదని గతంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ తదితర వ్యాధులతో పోల్చుకుంటే మరణాల రేటు చాలా తక్కువని, సదరు ఫ్లూ ద్వారా 40 శాతం మరణాలు ఉండగా, రాష్ట్రంలో కరోనా మరణాల రేటు కేవలం 1 శాతం అని జాతీయ స్థాయిలో కూడా కేవలం రెండున్నర శాతం ఉందన్నారు. బీపీ, షుగర్ వ్యాధు గ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఇమ్యునిటీని పెంచుకోవాలన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కరోనా పట్ల ప్రజలు చైతన్యంతో, అవగాహనతో ముందుకు వెళ్లే విధంగా మీడియా వాస్తవాలు అందించే విధంగా కృషి చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో 18.5 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారన్నారు. ఒక పక్క వైద్యులు కరోనా నియంత్రణకు ముందు వరుసలో నిలబడి వైద్యం అందిస్తున్నారని వారికి మీడియా కూడా సహకారం అందించాలన్నారు. చనిపోయిన పాత్రికేయులకు జర్నలిస్ట్ సంక్షేమ నిధి నుంచి సాయం అందించేవిధంగా చర్యలు తీసుకుంటామని పాత్రికేయ ప్రతినిధులకు సూచించారు.
ఆరోగ్య శాఖ కమీషనర్ కాటమనేని భాస్కర్ మాట్లాడుతూ పాత్రికేయులు వృత్తి పరంగా వివిధ ప్రాంతాలు తిరిగేటప్పడు మాస్క్ దరించి, తరచుగా శానిటైజ్ వాడాలని అదేవిధంగా తిరిగి ఇంటికెళ్లినప్పుడు తగిన విధంగా శానిటైజ్ చేసుకుని వెళ్లాలన్నారు. కోవిడ్ ఆసుపత్రులకు కవరేజ్ కు వెళ్లాలనుకునే పాత్రికేయులకు ఇబ్బందులు లేకుండా పీపీఈ కిట్లు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా జర్నలిస్టులు ధైర్యంగా విధినిర్వహణలో తమ విధులు నిర్వహించాలన్నారు. తమ అంచనా మేరకు కరోనా మరణాలు ఎక్కువగా ఆయా వ్యక్తులలో ఉన్న కోమార్బిడ్ రోగాల వల్ల సంబవిస్తున్నాయని, సదరు దీర్ఘకాలిక రోగాలున్న వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒకసారి కరోనా నుండి విడుదల పొందిన వ్యక్తులకు తిరిగి కరోనా సోకడం బహు అరుదని కాటమనేని భాస్కర్ తెలిపారు.
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కమీషనర్ దృష్టికి తీసుకొచ్చిన వారిలో చందు జనార్ధన్, అంబటి ఆంజనేయులు, చావా రవి, జి. ఆంజనేయులు, ఏ. అమరయ్య, టీవీ రమణ, సాంభశివరావు తదితరులు జర్నలిస్టు సంక్షేమం కోసం పలు సూచనలు చేశారు. వారు సూచించిన విషయాలను ముఖ్యమంత్రి ధృష్టికి తీసుకెళతానని సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. సమావేశంలో సమాచార పౌరసంబంధాల శాఖ అదనపు సంచాలకులు దాసరి శ్రీనివాస్,శ్రీమతి కస్తూరి తేళ్ల తదితర,పోతుల కిరణ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.