వ్యాక్సిన్ అభివృద్ధి నెమ్మదిపరిచేందుకు చైనా ప్రయత్నం
అమెరికా రిపబ్లికన్ సెనెటర్ ఆరోపణ
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారితో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికే ఎన్నో దేశాలు వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమయ్యాయి. ఈ సమయంలో అమెరికా-చైనా మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా పాశ్చాత్య దేశాలు చేస్తున్న వ్యాక్సిన్ అభివృద్ధిని అడ్డుకోవడం లేదా నెమ్మది పరిచేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా రిపబ్లికన్ సెనెటర్ రిక్ స్కాట్ ఆరోపించారు. ' వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక దశకు చేరుకున్నాం. ఈ సమయంలో కమ్యూనిస్టు చైనా దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయి' అని రిక్ స్కాట్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే మీ దగ్గర ఎలాంటి రుజువులు ఉన్నాయని అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఇది మేధావి వర్గం నుంచి తెలిసిందని మాత్రం వెల్లడించారు.
'చైనా అమెరికాతో సత్సంబంధాలను కోరుకోవడం లేదు. దీనిలో భాగంగానే అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యదేశాలకు విరోధిగా ఉండాలని చైనా నిర్ణయించుకుంది' అని రిక్ స్కాట్ ఆరోపించారు. మన ఆర్థిక వ్యవస్థలు తిరిగి అభివృద్ధిపథంలో పయనించేందుకు మనందరికీ ఈ వ్యాక్సిన్ ఎంతో ముఖ్యం. ఈ సమయంలో తొలుత ఇంగ్లాండ్ అభివృద్ధి చేసినా లేదా అమెరికా చేసినా, మేము అందరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ, చైనా మాత్రం అందుకు సిద్ధంగా లేదన్నారు.