నెల్లూరు, జనవరి 28, (రవికిరణాలు) : అర్హులైన లబ్దిదారులందరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సకాలంలో త్వరితగతిన అందేలా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు..మంగళవారం ఉదయం రాష్ట్ర సచివాలయం నుండి స్పందన కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి సంబంధించి రేషన్ కార్డులు, పింఛను కార్డులు, ఇళ్ల స్థలాల అర్జీలు ఎక్కువగా వున్నాయన్నారు. ఇందుకు సంబంధించి వచ్చిన అర్జీ దారులను చిరునవ్వుతో పలకరించి వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రేషన్ కార్డుల పై జిల్లా కలెక్టరు శ్రీ ఎం.వి. శేషగిరిబాబు మాట్లాడుతూ జిల్లాలో రేషన్ కార్డుల మార్పులు, చేర్పులు, కొత్త కార్డుల మంజూరు మరియు డోర్ డెలివరి పింఛన్లు జారీ కై అన్ని చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి కొత్త రేషన్ కార్డుల మంజూరు, పింఛన్లు ఇంటింటికి యిచ్చే విధంగా చర్యలు చేపట్టి పనులు పూర్తి చేయాలని ఈ సందర్బంగా జిల్లా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఫిబ్రవరి 2 నాటికి లబ్దిదారుల వివరాలను సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాలలో ప్రదర్శించాలన్నారు. కొత్తగా గ్రామ/వార్డు సచివాలయాలకు పింఛను లేదా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన అర్జీలను తక్షణమే స్పందించి ఐదు రోజులలో సంబంధిత కార్డులను అందజేయాలన్నారు. ఇళ్ల స్థలాల పంపిణికి కార్యక్రమానికి సంబంధించి ఉగాది నాటికి రాష్ట్రంలో 25 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయబడతాయన్నారు. లబ్దిదారుల అర్హతను బట్టి తుది జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. నామ మాత్రంగా కాకుండా యిచ్చిన స్థలం నివాస యోగ్యంగా వుండాలని, అక్కడ వుండడానికి లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేయాలన్నారు. 2020, ఫిబ్రవరి 15 నాటికి ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. మార్గదర్శకానికి పెద్ద పీఠ వేస్తామని అవినీతికి తావుండకూడదన్నారు.
జిల్లా కలెక్టర్లందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పై కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఫిబ్రవరి 20 నుండి విద్యార్థులకు వసతి దీవెన కార్యక్రమం చేపట్టబడుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 11 లక్షల 66 వేల మంది పిల్లలకు ప్రతి సంవత్సరం రూ.20,000/-లు యివ్వబడతాయని సదరు మొత్తం రెండు విడతలుగా ఫిబ్రవరి 20వ తేదీన రూ. 10,000/-లు, ఆగష్టులో రూ. 10,000/-లు వారి అకౌంటుకు జమచేయబడతాయన్నారు. రైతుభరోసా పథకం క్రింద గ్రామ సెక్రెటరియేట్లలో 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయన్నారు. నాణ్యమైన రసాయన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు సదరు కేంద్రాల ద్వారా రైతులకు అందజేయబడతాయన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తామన్నారు. రైతుభరోసా కేంద్రాలకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గ్రామ సచివాలయాలకు మౌలిక వసతుల సదుపాయం కల్పించవలసిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా చేపట్టబడే 541 పనులకు సంబంధించిన జాబితాను తయారు చేయించి గ్రామ సచివాలయాల్లో పెద్ద పెద్ద పోస్టర్ల ద్వారా ప్రదర్శించాలన్నారు. సదరు పనులు ఎన్నిరోజులలో పూర్తి చేయబడతాయోసూచించాలన్నారు. గ్రామ వాలంటీర్లతోపాటు వార్డు వాలంటీర్లకు కూడా హాజరు విధానాన్ని అమలు పరచాలన్నారు. గ్రామ సచివాలయాలలో వచ్చే అర్జీల పరిష్కారానికి సమయం నిర్ణయించడంతోపాటు రశీదులు కూడా యివ్వాలని పై పనులకు సంయుక్త కలెక్టర్లను ఇన్చార్జీలుగా నియమించాలని సంయుక్త కలెక్టర్ల కొరత వుంటే తెలియజేయాలన్నారు.ఫిబ్రవరి 15 నుండి కంటి వెలుగు పథకం ప్రారంభమవుతుందని, ఈ పథకం కింద అవ్వ, తాతలకు కంటి ఆపరేషన్లు చేయబడతాయన్నారు. పాఠశాల పిల్లలకు కంటి అద్దాల పంపిణి చేయబడుతుందన్నారు. 66 లక్షల 15 వేల 417 మంది పిల్లలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారన్నారు. ఇదే సమయంలో హెల్త్ కార్డుల పంపిణీ కూడా చేపట్టడం జరుగుతుందన్నారు.అమ్మఒడి పథకం క్రింద 42 లక్షల 33 వేల 98 మంది తల్లులకు 15 వేల రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు జమచేయబడతాయన్నారు. జిల్లా కలెక్టర్లందరూ వారానికొకరోజు పాఠశాలలకు వెళ్లి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పర్యవేక్షించాలన్నారు. మరుగుదొడ్లు ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. ఆకస్మిక తనిఖీలు జరపాలని రెవెన్యూ డివిజనల్ అధికారి స్థాయి వారిని ఇన్ చార్జిగా నియమించాలన్నారు. ఇంటింటికి ఇసుకపంపిణి కార్యక్రమం గురించి మాట్లాడుతూ,2 లక్షల 12 వేల టన్నులు ఇసుకను అందుబాటులో వుంచాలన్నారు. ఫిబ్రవరి 15 నాటికి అన్ని జిల్లాలలో డోర్ డెలవరిల ద్వారా యిసుకను సరఫరా చేయడానికి తగిన చర్యలు
తీసుకోవాలన్నారు. ఇసుకరీచ్ లలో వీడియో కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.దిశ చట్టానికి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారం నాటికి ప్రతి జిల్లాలో దిశ పోలీసు స్టేషన్లు ప్రారంభించాలన్నారు. ఒక్కొక్క పోలీసు స్టేషన్లో 5 మంది ఎస్.ఐ.లను నియమించాలన్నారు. ప్రతి జిల్లాలో ఒక అంకితభావంతో పనిచేసే న్యాయస్థానంతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పోలీసు అధి కారులు పోలీసు స్టేషన్ల ఏర్పాటు బాధ్యత తీసుకోవాలన్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది గురించి మాట్లాడుతూ, వారి జీతాలు పూర్తిగా వారికి అందేలా చూడాలన్నారు. ఎటువంటి తగ్గుదల లేకుండా పూర్తి మొత్తాలను వారి అకౌంట్లకు జమచేయాలన్నారు. లంచాలకు తావు లేకుండా చూడాలని, ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ వారికి ప్రాధాన్యతనిస్తూ వారికి సకాలంలో జీతాలు అందేలా ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ వారు చర్యలు చేపట్టాలన్నారు.ఈ వీడియోకాన్ఫరెన్స్ లో నెల్లూరు జిల్లా నుండి జిల్లా కలెక్టరు ఎం.వి. శేషగిరిబాబు, జిల్లా పోలీసు అధికారి భాస్కర్ భూషణ్, సంయుక్త కలెక్టరు డా. వి.వినోద్ కుమార్, స్పెషల్ కలెక్టరు దాసు, జడ్.పి. సి.ఇ.ఓ. సుశీల, డి.ఆర్.డి.ఎ.పి.డి. శీనా నాయక్, డి.ఎం.అండ్. హెచ్.ఓ. డా. రాజ్యలక్ష్మి, పౌర సరఫరాల అధికారి బాలకృష్ణా రావు, సి.పి.ఓ సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.