భాషా వేత్తలతో కలిసి భోజనం చేసిన ఉపరాష్ట్రపతి
ఫలప్రదమైన నిర్ణయాలతో గోష్ఠిని విజయవంతం చేయాలని సూచన
మంగళవారం నాడు (జనవరి 21న) ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించనున్న ఉపరాష్ట్రపతి
నెల్లూరు, జనవరి 20, (రవికిరణాలు) : ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని మైసూరు నుంచి నెల్లూరుకు తీసుకువచ్చిన నేపథ్యంలో తెలుగు భాష అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై భాషావేత్తలు, భాషాభిమానులు, తెలుగు పండితులతో ఏర్పాటు చేసిన కార్యగోష్ఠికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు విచ్చేశారు. స్వయంగా చొరవ తీసుకుని మైసూరు నుంచి నెల్లూరుకు ఈ కేంద్రాన్ని తీసుకుని వచ్చిన నేపథ్యంలో, భాష సంస్కృతిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు నిపుణులు, భాషా వేత్తలు, భాషాభిమానుల సలహాలు తీసుకుంటే ప్రణాళికలు తయారు చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్న ఉపరాష్ట్రపతి సూచనతో ప్రత్యేక చర్చాగోష్ఠిని ఏర్పాటు చేశారు. తెలుగు భాష అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కూలంకషంగా చర్చించి, ఫలప్రదమైన నిర్ణయాలతో ముందుకు రావాలని భాషావేత్తలకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ సందర్భంగా భాషావేత్తలతో కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, శలాక రఘనాథ శర్మ, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సహా పలువురు భాషా ప్రముఖులు పాల్గొన్నారు. జనవరి 21 అనగా రేపు ఉదయం ఉపరాష్ట్రపతి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించనున్నారు. అనంతరం కార్యగోష్ఠి ముగింపు సమావేశంలో ప్రసంగించనున్నారు.
ఈ నేపథ్యంలో అసలు ప్రాచీన హోదా అంటే ఏమిటి, దీనికి సంబంధించిన ఈ సంస్థ చేసే కార్యక్రమాలు ఏమిటి తదితర అంశాలను తెలుసుకుందాం.
తెలుగు భాషకి సుమారు 2వేల సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర వున్నట్లు వివిధ ఆధారాల ద్వారా తెలుస్తోంది. క్రీస్తుకు పూర్వమే తెలుగు ప్రజల వ్యవహార భాషగా వున్నట్లు అనేక నిరూపణలు ఉన్నాయి. క్రీ.శ.5వ శతాబ్దంలోని గద్య శాసనాలు, క్రీ.శ. 8వ శతాబ్దం నుంచి కనిపిస్తున్న పద్య శాసనాలు తెలుగు భాష క్రమ పరిణామాన్ని చాటుతున్నాయి. శాతవాహనుల పాలన గురించి బయటపడిన అనేక శాసనాలు, నాణేలు తెలుగు ప్రాచీనతకు ఆధారంగా నిలిచాయి. క్రీ.పూ. 3వ శతాబ్ది నుంచి లభ్యమవుతున్న శాసనాల్లో ఆంధ్రదేశంలోని గ్రామ నామాలు, వ్యక్తుల పేర్లు గోచరిస్తాయి. మౌర్య, అశోకుని కాలం నాటి ప్రాకృత శాసనాలు, బౌద్ధ స్తూపాలు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో లభించాయి. అశోకుని 13వ ధర్మలిపి శిలాశాసనంలో (క్రీ.పూ. 256-254) ఆంధ్ర, పుళింద జాతుల ప్రస్తావన ఉంది.ఇటాలియన్ భాషలాగే తెలుగు భాషలోని పదాలు సైతం అచ్చులతో ముగుస్తాయి కాబట్టి అజంత (అచ్చు+అంత) భాష అయిన మన తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెబుతూ ఉంటారు. మన దేశంలో ఎక్కువ శాతం మంది మాట్లాడే భాషలలో తెలుగు భాష మూడవ స్థానంలో వుంది. అలాగే ప్రపంచంలో 15వ స్థానంలో వుంది. 2001 జనాభా లెక్కల సమయంలో హిందీ తర్వాత దేశంలో మన తెలుగుభాషే ద్వితీయ భాషగా వుండేది. ఆ స్థానంలో బెంగాలీ వచ్చి చేరింది. అయితే తెలుగు మాట్లాడే వారి పూర్తి వివరాలు జనాభా లెక్కల సమయంలో సమర్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే కొందరు తెలుగు పెద్దల మాట. ఏదేమైనా దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల జాబితాలో మొదటి వరుసలోనే ఉండడం మన తెలుగు భాషకు గర్వకారణం. 2012లో ఇంటర్నేషనల్ అల్ఫాబేట్ అసోసియేషన్ వారిచే తెలుగుభాష ప్రపంచంలోకెల్లా రెండవ బెస్ట్ స్క్రిప్టుగా ఎన్నికైంది. మొదటి స్థానంలో కొరియన్ భాష నిలిచింది.
భాషారాష్ట్ర ప్రాతిపదికపై 1956 నవంబర్‌లో సువిశాలమైన ఆంధ్రప్రదేశ్ అవతరించిన నాటి నుంచీ తెలుగును అధికారభాషగా రూపొందించే ప్రయత్నాలు కొనసాగినా అవి నేటి వరకూ సాఫల్యం కాలేదు. 1955లో అయ్యదేవర కాళేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ ఈ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. 10 సంవత్సరాల తర్వాత 1966 మే 14వ తేదీన తెలుగును అధికార భాషగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనిని అమలు చేయడానికి తెలుగులో శాస్త్ర గ్రంథాలు, పారిభాషిక పదజాలం అవసరమైనాయి. వీటిని రూపొందించడానికి 1968లో తెలుగు అకాడమీ ప్రత్యేకంగా నెలకొల్పబడింది. శాస్త్ర గ్రంధాల అనువాదాలు మొదలైన కార్యక్రమాలు ప్రారంభమైనాయి. మరొక వైపు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మాండలిక వృత్తిపద కోశాలు రూపొందాయి.
అధికార భాషను పటిష్టంగా అమలు చేయడానికి ఆనాటి రాష్ట ప్రభుత్వం 1971లో అధికార భాషా సంఘాన్ని కూడా ఏర్పరచింది. తెలుగును అధికార భాషగా చేయటంలో సాధించిన ప్రగతిని సమీక్షించటం, ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం, అధికార భాషా స్థాయిని కలిగించటానికి అనువైన పరిభాష రూపకల్పనకు కృషి చేయటం భాషా సంఘం పరిధిలోని కార్యక్రమాలు. ఈ సంఘం కృషి ఫలితంగా 1971 తర్వాత జిల్లా స్థాయిలోనూ పరిపాలనా వ్యవహారాలు తెలుగులోనే కొనసాగాలన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ అమలు విషయానికి వచ్చేసరికి భాషాభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొంది. 1969 నుంచి ఇంటర్మీడియెట్ స్థాయిలోనూ, 1971 నుంచి డిగ్రీ స్థాయిలోనూ, 1985 నుంచి పి.జి స్థాయిలోనూ తెలుగు మీడియంలో విద్యాబోధనకు అనుమతి ఇచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో కూడా తెలుగులో సమాధానాలు రాయడానికి 1970లో సౌకర్యం ఏర్పడింది. తెలుగు మీడియం ద్వారా డిగ్రీలు పొందిన వారికి ఉద్యోగార్హత కల్పిస్తూ నాటి ప్రభుత్వం జీ.వో.లూ జారీ చేసింది. వీటి అమలు విషయంలోనూ అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
2004వ సంవత్సరం అక్టోబర్ 12న భారతదేశపు గెజెట్‌లో ‘ప్రాచీన భాషలు’ అనే పేరుతో కొత్త భాషా సముదాయాన్ని సృష్టిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం అదే సంవత్సరం సెప్టెంబర్ 2న జరిగిన కేంద్ర సాహిత్య అకాడమీ జరిపిన సమావేశంలో తమిళానికి ప్రాచీన హోదా ఇవ్వాలని సిఫారసు చేశారు. ఆ వెంటనే తమిళానికి ప్రాచీన హోదా దక్కింది. ఇదే సమయంలో తెలుగుకు సైతం ప్రాచీన హోదా ఇవ్వాలనే డిమాండ్ మొదలైంది. 2 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగుకు ప్రాచీన హోదా ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసి 2006లోనే ప్రాచీన హోదా ఇచ్చేందుకు సిద్ధమైంది. అనంతరం 2008 అక్టోబర్ 31న తెలుగును ప్రాచీన భాషలుగా గుర్తిస్తున్నామనే కేంద్ర ప్రకటన వెలువడింది. తెలుగే కాకుండా 2005లో సంస్కృతానికి, 2008లో కన్నడానికి, 2013లో మలయాళానికి, 2014లో ఒడియా భాషలకు ప్రాచీన హోదా అందించారు. తెలుగు ప్రాచీన హోదా విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన కోర్టు.. తెలుగు ప్రాచీన భాషేనని 2016 ఆగస్టులో తీర్పు చెప్పింది. దీంతో అన్ని అడ్డంకులూ తొలగినట్టయింది.
తెలుగు ప్రాచీన భాషగా చెప్పడానికి నన్నయ రాసిన ఆంధ్ర మహాభారతాన్ని ఆధారంగా చూపారు. మహాభారతం తొలి తెలుగు కావ్యం కాదని, ఇది మూల సంస్కృత వ్యాసభారతానికి అనువాదమేనని, నన్నయ తెలుగు ఆదికవి కాదని వాదనలు జరిగాయి. ప్రాచీన హోదా పొందాలంటే ఆ భాషకు వెయ్యేళ్ళకు పైగా సాహిత్య చరిత్రతో పాటు 15 వందల ఏళ్ళ భాషా చరిత్ర, స్వతంత్రమైందనే పేరు కావాలి. ఈ నేపథ్యంలో క్రీ.శ. 931 ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన పంపన రచించిన ఆది పురాణం, విక్రమార్జున విజయం చూపించి మన భాషా సాహిత్యానికి 1,070 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉన్నట్లు నిరూపించగలిగారు. అలాగే, పురావస్తు శాఖ తవ్వకాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన కోటిలింగాలలో లభించిన ఆధారాలను బట్టి అవి క్రీస్తుపూర్వం రెండు, మూడు శతాబ్దాలకు చెందినవని, అంతేకాక, పెద్దపల్లి సమీపంలోని ధూళికట్టలో కనుగొన్న బుద్ధుడి స్తూపం క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దానికి చెందిందని, వీటిని బట్టి మన భాషా చరిత్రకు పదిహేను వందల ఏళ్లకు పైగానే చరిత్ర ఉందని గట్టి ఆధారాలు చూపగలిగాం. ఇక పంపన తెలుగులోనే రచనలు చేయడం వల్ల అరువు తెచ్చుకున్న భాష మనది కానే కాదనీ చెప్పగలిగాం. ఫలితంగా కోర్టు తీర్పు తెలుగు ప్రాచీన హోదాకు అనుకూలంగా వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజనకు ముందే తెలుగు భాషకు విశిష్ట భాష హోదా దక్కడంతో ఇందుకు సంబంధించిన జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశారు. అంతలో రాష్ట్ర విభజన కారణంగా జాతీయ సంస్థలకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో ఈ విషయం మరుగున పడింది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ కేంద్రాన్ని మైసూర్‌లోనే ఏర్పాటు చేసింది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం దశాబ్దం గడుస్తున్నా ఇంకా మైసూర్‌లో కొనసాగడంపై ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు మైసూర్ వెళ్లినపుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ కేంద్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమేనని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సిల్) పేర్కొంది. ఆ క్రమంలో ఉప రాష్ట్రపతి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి తో మాట్లాడారు. అనంతరం వారు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తరాలు కూడా రాశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన రాకపోవడంతో, ఈ కేంద్రాన్ని త్వరగా ఏర్పాటు చేయాలన్న ఉపరాష్ట్రపతి సూచనతో దరిమిలా ప్రాచీన భాషా కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భాషాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నెల్లూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ సైతం ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి ఎలాంటి అద్దె లేకుండా భవనాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఫలితంగా ఈ కేంద్రం నెల్లూరులో స్థాపించేందుకు మార్గం సుగమం అయ్యింది.
వెయ్యి సంవత్సరాలకు పైగా సాహిత్యం ఉండి అభివృద్ధి చెందుతున్న భాషలో ప్రాచీనమైన, విశిష్టమైన గుణాలను గుర్తించి వాటిని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఈ ప్రాచీన ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. తమిళానికి ఇప్పటి వరకు ఇచ్చిన కోట్ల ధనాన్ని వారు తమ ప్రాచీన సాహిత్య పరిశోధనకు, అనువాదాలకు ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ సంస్థ సంచాలకుడిని, ప్రణాళిక సహాయకుల్ని, మిగిలిన సిబ్బందిని కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. వీటి కార్యకలాపాలను మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ (సీఐఐఎల్) నిర్వహిస్తుంది. ప్రాచీన భాషా శోధనకు సంబంధించిన ప్రణాళికలను చేపట్టి, వాటి వివరాలను సమర్పిస్తే వాటికి కేంద్ర ప్రభుత్వం ధనసహాయం చేస్తుంది. ప్రాచీన భాషకు సంబంధించి గొప్ప పరిశోధనలు జరగడానికి ధన సహాయం లభిస్తుంది. పరిశోధకుల్ని నియమించడానికి అవకాశం కలుగుతుంది.