నెల రోజుల వ్యవధిలోనే ఎస్‌ఈబీ సంచలనాలు
రాష్ట్రంలో 15,700కు పైగా కేసులు నమోదు
అక్రమ మద్యం, ఇసుకపై 21,798మంది అరెస్టు
లారీలు, కార్లు, బైకులు, ఆటోలు, బోట్లు 6,796 సీజ్
కేసులు
మద్యంపై: 14,200
ఇసుకపై: 1,545
అమరావతి,: మద్యం అయినా.. ఇసుక అయినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సక్రమంగా కొనుగోలు చేస్తే ఓకే.. అక్రమంగా తరలించి సొమ్ము చేసుకోవాలని చూస్తే మాత్రం సంకెళ్లు తప్పవని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) హెచ్చరిస్తోంది. పూల వ్యాన్లు, పండ్ల లారీలు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆఖరికి నదీ మార్గంలో బోట్లు.. ఏ రూపంలో పొరుగు మద్యం రాష్ట్రంలోకి తీసుకొచ్చినా, ఇసుకను అక్రమంగా తరలించినా పట్టుకుంటామని ఎస్‌ఈబీ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోకి పొరుగు మద్యం రాకుండా.. ఇక్కడి నదులు, వాగుల్లోని ఇసుక అక్రమంగా తరలిపోకుండా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల క్రితం ఎస్‌ఈబీని ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాకు ఒక యువ ఐపీఎస్ లేదా అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో పోలీసు, ఎక్సైజ్ సిబ్బందితో బృందాలను ఏర్పాటు చేసింది.
ఐజీ స్థాయి అధికారి వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో నెల రోజులుగా రాష్ట్రంలోని అక్రమ మద్యం దిగుమతి, ఇసుక అక్రమ ఎగుమతిని నిరోధిస్తోన్న ఎస్‌ఈబీని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా మద్యం అక్రమ సరఫరాపై 14,200 కేసులు నమోదు చేసి 18,961 మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబీ అధికారులు వివరించారు. కోట్లాది రూపాయల విలువైన 75,732 లీటర్ల మద్యం సీజ్ చేసి 12.86 లక్షల లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. నాటుసారా తయారీకి వినియోగించే 46వేల కిలోల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నామని, 10,530 కిలోల గంజాయి కూడా సీజ్ చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 4,187 ద్విచక్ర వాహనాలు, 127ఆటోలు, 400 కార్లు, లారీలు-ట్రక్కుల్లాంటివి 60.. ఇలా మొత్తం 4,872 వాహనాలు సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.