బ్రిటన్‌లో బయటపడిన కరోనా కొత్త జన్యువు ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. కొత్తరకం కరోనా వైరస్‌తో దేశాలన్నీ మరోసారి అప్రమత్తమవుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా యూకే వచ్చిపోయే అంతర్జాతీయ విమాన సర్వీలపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నాయి. యూరప్ దేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్, క్వారంటైన్ తప్పనిసరని పేర్కొంది భారత విమానయాన శాఖ. యూకేలో కొత్తరకం వైరస్ విషయంలో ముందుజాగ్రత్త చర్యగా మరిన్ని దేశాలు విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. ప్రపంచ దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా యూకే నుంచి విమాన, రైళ్ల రాకపోకల్ని తాత్కాలికంగా ఆపేశాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ కూడా బ్రిటన్ విమానాలను నిలిపివేసింది. గత రెండు వారాల్లో ఎవరైనా బ్రిటన్ సందర్శిస్తే..వారిని కూడా ఇటలీలోకి అనుమతించడం లేదు. పోర్చుగల్ మాత్రం తమ పౌరులను మాత్రమే యూకే నుంచి అనుమతిస్తోంది. అది కూడా కొవిడ్ నెగటివ్ రిపోర్టు ఉన్నవారిని మాత్రమే విమానాల్లో అనుమతిస్తున్నారు.కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో దాన్ని అరికట్టడానికి లండన్ సహా దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్ విధించారు. కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోంది. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్ కేసులున్నాయి. ఇటలీలోనూ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించారు. క్రిస్మస్ షాపింగ్ కోసం ప్రజలు బహిరంగంగా గుమిగూడే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 6 వరకు ఇటలీలో రెడ్‌జోన్ ప్రకటించారు. కొత్తరకం కరోనా వైరస్‌తో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తోంది. క్రిస్మస్ వేళ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అక్కడి టైర్-4 నిబంధనలను అమలు చేస్తోంది.
నిత్యావసరం కాని సరకుల దుకాణాలు, వ్యాపారాలు, వ్యాయామశాలలు, సినిమా హాళ్లు, సెలూన్లను రెండు వారాలు మూసివేశారు. దక్షిణ ఇంగ్లాండ్‌లో తాజా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత్ కూడా నూతన రకం వైరస్ వ్యాప్తిని నివారించేందుకు సన్నద్ధమవుతోంది. యూకే పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదనన్నారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై భారత్ ఆంక్షలు విధించింది. డిసెంబరు 31వరకు బ్రిటన్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను రద్దు చేసింది. యూకే నుంచి డిసెంబరు 22 అర్ధరాత్రిలోపు భారత్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. ఒకవేళ ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలితే వారిని ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపుతామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరి తెలిపారు. పరీక్షల్లో వైరస్ నెగెటివ్ వచ్చినా కూడా ఆయా ప్రయాణికులు ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.