ఓట్లేసి గెలిపించిన ప్రజలకే తూట్లు పొడుస్తున్న మంత్రి అనిల్
-ధ్వజమెత్తిన జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి
-------------------
రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాక తాను నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనే విషయం మరచినట్టు ప్రవర్తిస్తున్నారని, ఓట్లేసి గెలిపించిన నెల్లూరు సిటీ ప్రజలకు తూట్లు పొడుస్తున్నారని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన నెల్లూరు సిటీ 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘం, సర్వేపల్లి కాలువ ప్రాంతాల్లో పర్యటించారు. కాలువ ఆధునీకరణ పేరుతో ఏళ్ళ తరబడి నివాసం ఉండే పేదల గృహాలకు మంత్రి అనిల్ ఎసరు పెట్టారనే విషయం తెలుసుకుని బాధితులకు అండగా నిలిచేందుకు వెళ్లారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే సమయంలో మంత్రి అనిల్ పేదలకు సంబంధించి ఎక్కడ గృహాలు తొలగిస్తున్నా తీవ్రంగా విరుచుకుపడే వారని గుర్తు చేసారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా, అది కూడా మంత్రి హోదాలో అనిల్ చేస్తున్న పనులు చూస్తుంటే ఆనాడు సానుభూతి డ్రామాలు ఆడినట్లు కనిపిస్తుంది తప్పించి ప్రజల క్షేమం కోసం కాదని తెలుస్తుందన్నారు. డిసెంబర్ 25న నెల్లూరు సిటీలో పేద ప్రజలందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చేశాం అని ఘనంగా ప్రకటించిన అనిల్ కనీసం పది శాతం లబ్దిదారులకు కూడా పట్టాలు ఇవ్వలేదని ఎద్దేవా చేసారు. ఇళ్ళ పట్టాలు రాక ప్రజలు సచివాలయాల చుట్టూ తిరుగుతుంటే ఇప్పుడేమో పట్టాలిచ్చేసాం కదా లేచి పోండని నెల్లూరు సిటీలో పలు ప్రాంతాల్లోని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక్క గుర్రాలమడుగు సంఘం, సర్వేపల్లి కాలువ ప్రాంతంలోనే మూడొందలకు పైగా ఇళ్ళను తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారని, ఆధునీకరణ పేరుతో బినామీ కాంట్రాక్టులు చేసుకుంటూ కోట్ల రూపాయలను కొల్లగొట్టే చర్య తప్పించి ఇది ప్రజల బాగు కోసం కాదని తెలిపారు. ఇక్కడి ప్రజలకు పీఎంఎవై అపార్ట్మ్మెంట్లలో కానీ, ఇళ్ళ స్థలం ఇచ్చి ఇళ్ళు కట్టించి పూర్తి స్థాయిలో గృహ ప్రవేశాలు జరిగిన తర్వాత మాత్రమే ఈ ఇళ్ళ జోలికి రావాలని, లేనిచో జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ప్రతిఘటిస్తామని కేతంరెడ్డి హెచ్చరించారు.
పై కార్యక్రమంలో.. నాయకులు పావుజెన్నీ చంద్రశేఖర్ రెడ్డి, 16 డివిజన్ నాయకులు శిరీషా రెడ్డి,
వెంకట్, శ్రీను, నాని, నాయకులు కుక్క ప్రభాకర్, రాజా, నాసర్, హేమంత్, సాయి మరియు స్థానికులు పాల్గొన్నారు.