విక్రమ సింహపురి యూనివర్సిటీ ఆచార్యుడిపై కమిటీ వేసి విచారణకు ఏబీవీపీ డిమాండ్



అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ భవన్ లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు . విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఆచార్యుడు ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక ఆచార్యుని రాసిన పరిశోధనా వ్యాసాన్ని తన పేరిట జర్నల్లో ప్రచురించుకోవడం జరిగిందని దీనిపై నిజ నిర్ధారణ కమిటీ వేసి విచారణ చేయాలని ఏబీవీపీ యూనివర్సిటీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తుంది.


ఈ సందర్భంగా జిల్లా సంఘటన కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ యూనివర్సిటీలోని ఒక ప్రొఫెసర్ పై వచ్చిన ఆరోపణల పై పూర్తిస్థాయిలో కమిటీ వేసి అతని పై యూజీసీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

యూనివర్సిటీ పరిధిలో విద్యాప్రమాణాలు పెంచే విధంగా ఉండాలి కానీ దిగజారుడు విధంగా ఉండకూడదన్నారు. భవిష్యత్తుకు పరిశోధన ప్రమాణాలు అందించే విధంగా ఆదర్శంగా ఉండాలి కానీ దొంగ పరిశోధనలను ప్రచురించికొనే విధంగా ఉండకూడదన్నారు. ఈ విషయం 2019 లో ఉత్తరప్రదేశ్ వాసి అప్పటి రిజిస్టర్ అంజని ప్రసాద్ గారికి మెయిల్ ద్వారా తెలియజేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినప్పటికీ, యూనివర్సిటీ యాజమాన్యం ఒక సంవత్సరం గడుస్తున్నా ప్రొఫెసర్ పైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు.

ఈ విషయాన్ని కప్పిపుచ్చి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేకుండా ఉంచడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీ యాజమాన్యం స్పందించి కమిటీ వేసి విచారణ జరిపించి అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. విచారణ చేయని యెడల ఈ విషయంపై ఉన్నత విద్యా మండలి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జయంత్, సహాయ కార్యదర్శి సాయికృష్ణ , శ్రీను తదితరులు పాల్గొన్నారు.