బీజేపీలోకి విజయశాంతి...?
తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందా ? దుబ్బాక ఎన్నికల తరువాత బీజేపీ పుంజుకుంటుందా? తెలంగాణలో ఆపరేషన్ కమలం షురూ కానుందా అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే అంటున్నాయి. తెలంగాణ బీజేపీలో యువనాయకత్వానికి పెద్దపీట వేయడంతో పాటుగా బలమైన నేతలకు పదవులు అప్పటిస్తున్నారు. 2019 ఎన్నిలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణకు ప్రస్తుతం జాతీయ బీజేపీ ఉపాధ్యక్షురాలిగా నియమించారు. యువనేత బండి సంజయ్ కు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అలానే, నిజామాబాద్ నుంచి మొదటిసారి ఎంపీగా గెలుపొందిన కిషన్ రెడ్డికి కేంద్రమంత్రిగా అవకాశం కల్పించారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అధిష్ఠానం అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదిగిన తెరాస ను అడ్డుకోవడానికి భారతీయ జనతాపార్టీ అనుకూలమైన అన్ని మార్గాలను వినియోగించుకుంటూ ఆపరేషన్ కమలం కు తెరలేపుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నేత, నటి విజయశాంతిని బీజేపీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిన్నసాయంత్రం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విజయశాంతిని కలిశారు. దాదాపుగా గంటపాటు చర్చించారు. ఈ చర్చల తరువాత బండి సంజయ్ అరెస్ట్ ను ఆమె ఖండించారు. దీంతో విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.