వరద పట్ల నెల్లూరు సిటీ ప్రజలను అప్రమత్తత చేయలేకపోవడం జలవనరుల శాఖ ఘోర వైఫల్యం
-జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి
*అనావృష్టి ఎంతటి దరిద్రమో, అతివృష్టి కూడా అంతే దరిద్రం
*ప్రకృతి సమతుల్యత దెబ్బతినేలా పాలకుల పనితీరు ఉంది
*అతివృష్టిలో పెన్నా నదిని డ్రోన్ షాట్లు తీసి ప్రచారం చేసుకోవడం సిగ్గు మాలిన చర్య
*కండలేరు నిండకుండా సోమశిల గేట్లు ఎత్తే చెత్త రికార్డులు అనిల్ కుమార్ యాదవ్ కే సొంతం
*నీట మునిగిన వెంకటేశ్వరపురం ప్రాంతంలో పర్యటించిన కేతంరెడ్డి వినోద్ రెడ్డి
*తీవ్రంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్
----------------------
జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి నేడు నెల్లూరు సిటీలో పెన్నా వరద ధాటికి నీట మునిగిన వెంకటేశ్వరపురం, జనార్ధనరెడ్డి కాలనీ ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలలుగా రాష్ట్రంలో కృష్ణా నది, గోదావరి నదులకు వరదలు వచ్చిన పరిస్థితి అందరం చూసామన్నారు. కృష్ణా నదికి వరద పోటెత్తినప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా సోమశిలకు జలాల తరలింపు జరుగుతోందన్నారు. అదే తరహాలో పెన్నానది క్యాచ్ మెంట్ ఏరియాలో పడే వానలు ద్వారా కూడా సోమశిల నిండుతోందన్నారు. రెండు నెలలుగా సరైన వ్యూహంతో ఆ నీటిని ఉపయోగించుకుని ఉంటే ఈ పాటికి కండలేరు జలాశయం కూడా పూర్తిగా నిండి ఉండేదన్నారు. కానీ ఆర్భాటలకు పోయే జలవనరులశాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ పెన్నానదిని డ్రోన్ షాట్ వీడియోలు తీయించుకునేందుకు, సోమశిలలో జలాలను విడతల వారీగా కాకుండా అన్ని గేట్లను ఒక్కసారిగా ఎత్తే వ్యూహం రచించారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అనావృష్టి కారణంగా ఏర్పడే కరువు ఎంత దరిద్రమో, నేడు ఏర్పడిన అతివృష్టి కూడా అంతే దరిద్రమన్నారు. జలాలను ఎలా వినియోగించుకోవాలనే కనీస అవగాహన లేక నేడు జిల్లాలో వరద ముంపుకు గురయ్యి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఒక్కసారిగా లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రం పాల్జేస్తూ నీటిముంపుకి గురయ్యే ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయకపోవడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడం తీవ్ర వైఫల్యమన్నారు. వెంకటేశ్వరపురంలో నీట మునిగిన ఇళ్లను చూస్తుంటే హృదయవిధారకరంగా ఉందన్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయి, ఇప్పుడు మరలా ఈ వరద వల్ల తీవ్రంగా నష్టపోయిన ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాకు మురళి రెడ్డి, షేక్ ఆలియా, శ్రీకాంత్ యాదవ్, కుక్కా ప్రభాకర్, మోష, హేమంత్, హరీష్ రెడ్డి, మన్సూర్, నాగరాజు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.