బురేవి తుపాను కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి
బురేవి తుపాను కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేరళ, తమిళనాడులోని దక్షిణ జిల్లాలను ఈ తుఫాను తాకుందని ఐఎండి హెచ్చరికల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించాయి. రెండు రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో 24 గంటల్లో 20 సెంమీలకు పైగా భారీ నుండి అతిభారీ వర్షాలు పడతాయని ఐఎండి హెచ్చరించింది. తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో విమాన కార్యకలాపాలను 8 గంటలపాటు (ఉదయం 10గంటలు- సాయంత్రం 6గంటలు) రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం నుండి తుఫాను గండం తప్పేవరకూ త్రివేండ్రంలోని ఎయిర్‌పోర్టు మూతపడుతుందని తెలిపారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నవాళ్లు తమ సమయాల్లో మార్పుల కోసం, తాజా పరిస్థితులు తెలుసుకునేందుకు ఎయిర్‌లైన్స్‌ను సంప్రదించాలని త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ట్వీట్ చేసింది. అలాగే రివైజ్డ్ టైమ్ షెడ్యూల్‌ను కూడా షేర్ చేసింది.మరోవైపు బురేవి తుపాను బలహీన పడుతోందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. బుధవారం శ్రీలంక తీరాన్ని దాటిన తర్వాత శుక్రవారం తమిళనాడు తీరాన్ని తాకుతుందని ముందుగానే ఊహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రామనంతపురానికి 40 కి.మీ దూరంలో ఉంది. తర్వాత తూత్తుకుడిని తాకుతుంది. ఇక్కడ 50-60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి హెచ్చరించింది.
కేరళ ప్రభుత్వం ఇప్పటికే తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్టా, అలపుజా, ఇడుక్కి జిల్లాల్లో సెలవు ప్రకటించింది. తమిళనాడు కూడా విరుదంగర్, రామనంతపురం, తిరునెలెవి, తూత్తుకుడి, తెన్‌కాశి, కన్యాకుమారిలలో సెలవు ప్రకటించింది. మధురై ఎయిర్‌పోర్టులోనూ విమాన కార్యకలాపాలను రద్దుచేసింది. ట్యుటికోరిన్ ఎయిర్‌పోర్టు కూడా శుక్రవారం మూతపడుతుందని అధికారులు తెలిపారు.