తీరం వైపు తుపాన్
తీరం వైపు తుపాన్
⚡పాంబన్, మండపం, ధనుష్కోటిలో తాకిడి
⚡రెండు రోజులు భారీ వర్షాలు
⚡సెంబరంబాక్కం గేట్లు ఎత్తివేత
బురేవి తుపాన్ రూపంలో రాష్ట్రంలోని సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు పది అడుగుల మేరకు ఎగసిపడడంతో కలవరం తప్పలేదు. పాంబన్, మండపం, ధనుష్కోటి తీరాల్లో తుపాన్ దాటికి తీవ్ర నష్టం ఎదురయ్యే పరిస్థితి. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం ఉదయాన్నే ఈ తుపాన్ తీరం దాటినానంతరం కూడా రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం పడనుంది. సెంబరంబాక్కం గేట్లను మళ్లీ తెరిచారు. అడయార్ నదీ తీరవాసుల్ని అప్రమత్తం చేశారు.
బంగాళాఖాతంలో నెలకొన్న బురేవి తుపాన్ బుధవారం శ్రీలంకలోని త్రికోణమలై వద్ద తీరాన్ని తాకింది. అక్కడ తన ప్రళయ ప్రతాపాన్ని చూపించిన బురేవి గురువారం మన్నార్‌వలిగుడా మీదుగా తమిళనాడు సరిహద్దుల వైపుగా కదిలింది. తొలుత పాంబన్‌కు 110 కి.మీ దూరంలో మధ్యాహ్నం వరకు కొన్ని గంటల పాటు ఈ తుపాన్ కేంద్రీ కృతమై ఉండడంతో నాగపట్నం, తిరువారూర్, తంజావూరు డెల్టా జిల్లాల్లో, దిండుగల్, నీలగిరి, తేని కొండ ప్రాంతాలతో నిండిన జిల్లాల్లో, కడలూరు, విల్లుపురం, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో అనేక చోట్ల భారీగానే వర్షం పడింది. చెన్నైలో తెరపించి తెరపించి అక్కడక్కడ వర్షం పడుతూ వచ్చింది. ఈ బురేవి తుపాన్ దాటికి చెన్నై నుంచి కన్యాకుమారి వరకు సముద్ర తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అనేక తీర ప్రాంతాల్లోని గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చే పరిస్థితి నెలకొంది.
ఐదు జిల్లాల్లో..
తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లోనే ఈ తుపాన్ ప్రభా వం ఎక్కువగా ఉంది. ముందు జాగ్రత్తలతో పెనునష్టాన్ని తప్పించే చర్యలో అధికార వర్గాలు నిమగ్నమయ్యాయి. శివగంగై, మదురై, విరుదునగర్‌లలోనూ అనేక చోట్ల వర్షాలు పడుతూ వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత క్రమంగా ఈ తుపాన్ నైరుతి దిశలో పయనించడం మొదలెట్టింది. సాయంత్రం ఏడు గంటల సమయంలో గంటకు 16 కి.మీ వేగంతో తీరం వైపుగా బురేవి దూసుకురావడంతో వర్షం తీవ్రత క్రమంగా పెరిగింది.
ఆ మూడు చోట్ల కల్లోలమే..
శ్రీలంకను దాటి మళ్లీ తమిళ భూభాగాన్ని తాకేందుకు బురేవి కదలడంతో అధిక ప్రభావం రామేశ్వరం, మండపం, పాంబన్ సముద్ర తీరాల్లో నెలకొంది. గంటకు 90 నుంచి వంద కి.మీ వేగంతో గాలులు వీయడం, సముద్రంలో అలల తాకడి వెరసి ప్రజల్లో ఆందోళన తప్పలేదు. ముందుగానే తీరవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినా, ఎలాంటి విపత్తు ఎదురవుతుందో అనే ఆందోళన వీడలేదు. ఇందుకు తగ్గట్టుగానే సముద్ర తీరంలోని చెక్‌పోస్టులు, రోడ్లు దెబ్బ తిన్నాయి. పాంబన్ తీరంలో చిక్కుకున్న కొందరు జాలర్లను రక్షించారు. తీరం వైపు సమీపించే కొద్ది సముద్ర తీర జిల్లాల్లో అనేక చోట్ల వర్షాలు మొదలయ్యాయి.
రెండు రోజులు వర్షం..
బురేవి పాంబన్ – కన్యాకమారి మధ్యలో గురువారం అర్ధరాత్రి వేళ తీరాన్ని తాకనుంది. ఇది పూర్తిగా తీరాన్ని దాటేందుకు శుక్రవారం ఉదయం వరకు సమయం పట్టనుంది. దీంతో రామనాథపురం, కన్యాకుమారి తీరాల్లో అతి భారీ వర్షం పడింది. ఈ తుపాన్ తీరం దాటినా రెండు రోజులు రాష్ట్రంపై దీని ప్రభావం ఉంటుంది. తిరుచ్చి, తిరువారూర్, తంజావూరు, అరియలూరు, కడలూరు, విల్లుపురంఈరోడ్, ధర్మపురి, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లా ల్లో ఈ ప్రభావంతో వర్షాలు మోస్తరుగా పడనున్నాయి. పుదుచ్చేరిలోనూ వర్షం పడుతుండడంతో శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఉబరి నీటి విడుదల....
కాంచీపురం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు సెంబరంబాక్కంలోకి నీటి రాక మరో మారు పెరిగింది. గురువారం 22 అడుగుల్ని మళ్లీ నీటి మట్టం దాటడంతో గేట్లను ఎత్తి వేసి ఉబరి నీటిని విడుదలచేస్తున్నారు. చెన్నై శివార్ల నుంచి , సెంబరంబాక్కం నుంచి అడయార్‌లోకి నీటి రాక పెరడం ఆతీరం వెంబడి ప్రజల్ని అప్రమత్తం చేశారు. పూండి రిజర్వాయర్ నీటి మట్టం పెరగడంతో గురువారం మరో రెండు గేట్లను తెరిచి 4500 గణపుటడుగుల నీటిని విడుదల చేశారు.
అమిత్ షా ఆరా..
బురేవిని ఎదుర్కొనే విధంగా చేపట్టిన ముందు జాగ్రత్తల్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. వారం వ్యవధిలో తమిళనాడు రెండు తుపాన్‌లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగానే వ్యవహరించే పనిలో పడింది. ముందు జాగ్రత్తలు ఆగమేఘాలపై జరిగాయి. దీంతో సీఎం పళనిస్వామితో ఫోన్లో మాట్లాడిన అమిత్‌షా ముందు జాగ్రత్తలపై ఆరా తీశారు. విపత్తులు ఎదురైన అందుకు తగ్గట్టు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.