అమరావతి ఉద్యమం  నేటితో 200 రోజులు పూర్తి అయింది. ''మేము భూములిచ్చింది రాజధాని నగరం కోసం! మేము ఒప్పందాలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వంతో! అంతేతప్ప...వ్యక్తులతోనో, పార్టీలతోనే కాదు! చట్టబద్ధమైన ఒప్పందాలను గౌరవించితీరాల్సిందే'' అని రైతులు తేల్చి చెబుతున్నారు. తమకు ఇచ్చిన హామీ, ఒప్పందాలకు లోబడి రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఏకైక డిమాండ్‌తో ఉద్యమిస్తున్నారు. ఈ రెండొందల రోజుల ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. వేధింపులు, కేసులు, లాఠీచార్జీలు... ఇలా ఎన్నెన్నో నిర్బంధాలు. చివరికి... శాంతియుత ఉద్యమంపై ఏమిటీ ఉక్కుపాదం అని ఉన్నత న్యాయస్థానం పలుమార్లు తలంటిన తర్వాతే పోలీసుల తీరు మారింది. రైతులు తమ ఉద్యమ పంథా మార్చారు. అప్పటిదాకా... వంటా వార్పూ, అమ్మోరికి పొంగళ్లు, ధర్నాలు చేసిన వారు... ఉద్యమంపై పట్టు సడలించకుండా ఇళ్లవద్దే తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షంలో వున్నపుడు ఓ మాట...అధికారంలోకి వచ్చాక మరోబాట పడుతున్న నేతలకు కనువిప్పు కలిగేంతవరకూ తమ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని అమరావతి ఉద్యమ దీక్షాపరులు స్పష్టం చేస్తున్నారు. నేడు 200 రోజులు పూర్తి అయినా సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్టు రాజధాని సాధన సమితి పేర్కొంది.