రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్
రొట్టెల పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్.,
ఈనెల 29 వ తేదీ నుంచి ప్రారంభమవనున్న నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ వికాస్ మర్మత్ తెలిపారు.
రొట్టెల పండుగ నిర్వహణ ఏర్పాట్లను బారా షహీద్ దర్గాలో కమిషనర్ మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. షామియనాలు, కమాండ్ కంట్రోల్ విభాగం, వి.ఐ.పి రిసెప్షన్, సి.సి కెమెరాలు, విద్యుత్ లైటింగ్, పారిశుద్ధ్యం, స్త్రీలకు మరుగుదొడ్లు, పార్కింగ్, మహిళలకు రక్షణ, బారికేడ్ల నిర్మాణం, పోలీసుల పర్యవేక్షణ, స్వర్ణాల చెరువు తీరం వెంబడి భద్రతా చర్యలు వంటి వివిధ అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేసుకుని రొట్టెల పండుగను ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కమిషనర్ వెల్లడించారు. పండుగకు విచ్చేసే భక్తులంతా క్రమశిక్షణగా రొట్టెలు మార్చుకునేలా, దర్గాలో మొక్కులు చెల్లించుకునేలా పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేస్తామని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పి.ఆర్.ఓ.
నెల్లూరు నగర పాలక సంస్థ.