అన్ని చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలి 

 రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్  చైర్మన్ వెల్లడి 





నెల్లూరు,మేజర్ న్యూస్ :  రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న అన్ని చట్టాలను సమర్థవంతంగా అమలుచేసి జిల్లాలో బాలల సంరక్షణకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ బి పద్మావతి సూచించారు. శుక్రవారం ఉదయం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో  జిల్లాలో బాలల సంరక్షణకు చేపడుతున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై  మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కమిషన్‌ చైర్‌పర్సన్‌ పద్మావతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదలతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నట్లు చెప్పారు. బాలల సంరక్షణే లక్ష్యంగా అనేక వ్యవస్థలు పనిచేస్తున్నాయన్న చైర్‌పర్సన్‌ అన్ని వ్యవస్థలు కూడా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన, బాలల అపహరణ, బాలికల అత్యాచారాలు వంటి అమానవీయ సంఘటనలు జరగకుండా సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బాలకార్మికుల నిర్మూలనకు స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని, జిల్లాలో సుమారు 60మంది బాలలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించినట్లు ఆమె చెప్పారు. మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు లోనుకాకుండా రాష్ట్రప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రహరీక్లబ్‌లు ఏర్పాటుచేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. బాలల సంరక్షణ కేంద్రాలు, బాలసదన్‌లు, శిశుగృహలో వుంటున్న అనాథ చిన్నారులను వారి తల్లిదండ్రుల చెంతకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నామని, తల్లిదండ్రుల ఆచూకీ దొరకకపోతే నిబంధనల మేరకు దత్తత ప్రక్రియ చేపడుతున్నట్లు ఆమె చెప్పారు. బాలకార్మిక వ్యవస్థ, బాల్యవివాహాలు, యాచకవృత్తికి చిన్నారులను ఉపయోగించడం, బాలికలపై అత్యాచారాలు మొదలైన బాలల హక్కులకు భంగం కల్గించే అంశాలపై కమిషన్‌ ప్రత్యేకదృష్టితో పనిచేస్తుందని చెప్పారు. జిల్లాలో అనాధలు, భద్రత లేని చిన్నారుల గుర్తించేందుకు, బాల కార్మిక వ్యవస్థ, బాలవివాహాల నిర్మూలనకు జిల్లా కలెక్టర్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు చేశారని, ఈ కమిటీ ద్వారా జిల్లాలో బాలల సంక్షేమానికి ఓ మంచి వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని ఆమె చెప్పారు. ఐసిడిఎస్‌ పరిధిలోని మహిళా శిశు సంక్షేమశాఖ, బాలల సంరక్షణ కమిటీ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అందరూ జిల్లాలో చిన్నారుల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టి అనాథ బాలలు, వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులను తమ పిల్లల వలె భావించి వారి జీవితానికి భరోసాగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ హేనాసుజన్‌, జిల్లా కార్మికశాఖ ఉపకమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్‌, బాలల  సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్‌ మాధవి, సమత, ఐసిడిఎస్‌ వివిధ విభాగాల అధికారులు, బాలల సంరక్షణ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.