తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన ఇండుగిమిల్లి వరప్రసాద్‌ శిరోముండనం కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ కేసు వ్యవహారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దాకా కూడా చేరింది. ఈ కేసు విషయమై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫస్ట్ టైమ్ స్పందించారు.
కఠిన చర్యలు తప్పవు..
మంగళవారం నాడు బెంగళూరుకు బయల్దేరే ముందు కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులపై దాడులను, అనైతిక చర్యలపై నిశితంగా చర్చించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని సీఎం తేల్చిచెప్పారు. బాధ్యులు ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులపైనా కేసులు నమోదు చేసి జైలుకు పంపామన్న విషయాన్ని జగన్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దళితులమీద దాడులు సహా, ఇతరత్రా ఘటనలు జరిగినప్పుడు గతంలో పట్టించుకునేవారు కాదన్నారు. కానీ గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది జగన్ చెప్పుకొచ్చారు.
తప్పు ఎవరు చేసినా తప్పే..
తప్పు ఎవరు చేసినా తప్పేనని.. మన ప్రభుత్వం ఆలోచనలో ఉన్న స్పష్టత ఇదేనని కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ చెప్పారు. గతంలో దళితులపై జరగరానివి జరిగితే ఎక్కడా చర్యలు తీసుకోలేదన్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావాలి.. ఆ దిశలోనే పలు చర్యలు తీసుకుంటామన్నారు. గుండు కొట్టించడంలాంటి ఘటనలు తప్పు అని జగన్ వ్యాఖ్యానించారు. మన పోలీసు ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం బాధాకరమేనని జగన్‌ తెలిపారు.
స్పందించిన కోవింద్‌
ఇదిలా ఉంటే.. శిరోముండనం కేసుపై రాష్ట్రపతి కార్యాలయం ఇప్పటికే రెండు పర్యాయాలు స్పందించింది. రాష్ట్రపతి కార్యాలయం ఆదేశించినప్పటికీ తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి న్యాయం జరగడం లేదని, తన గోడును పట్టించుకోవడం లేదని వరప్రసాద్‌ మరోసారి రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో రాష్ట్రపతి కోవింద్‌ వెంటనే స్పందించారు. ఈ కేసును తక్షణం విచారించేలా కేంద్ర సామాజిక న్యాయశాఖను ఆదేశించారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన ఫైలును సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆగస్టు-18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.