శాంతియుత సమాజం కోసం యువత కృషి చేయాలి

లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కార్యదర్శి



గూడూరు : శాంతియుత సమాజం కోసం యువత కృషి చేయాలని లయన్స్ క్లబ్ జిల్లా అదనపు కార్యదర్శి షేక్. రియాజ్ అహమద్ పిలుపునిచ్చారు. మంగళవారం అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితిలో లయన్స్ క్లబ్ సభ్యత్వం కలిగి ఉందన్నారు. ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భారతదేశం శాంతికి ప్రతీక అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఏకైక దేశం భారతదేశమన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుత సమాజం కోసం పాటుపడాలని సూచించారు. లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ ఛైర్మన్  ఎం. మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే శాంతంగా ఉండడం అలవర్చుకోవాలని సూచించారు.  కార్యక్రమానికి సీనియర్ లయన్ శీనయ్య అధ్యక్షత వహించారు. అనంతరం శాంతికి చిహ్నంగా తెల్ల పావురాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి రవిచంద్రారెడ్డి, కార్యదర్శి కల్యాణ్ సాయి, జోన్  ఛైర్మన్ వాకాటి రామమోహన్ రావు, లయన్స్ సభ్యులు మదనమేటి రమణయ్య, షేక్. ఇలియాజ్ అహమద్, ఇష్వాఖ్,    హెడ్ మాస్టర్ ఎండీ. రవూఫ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.