శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులతో రాష్ట్ర సాంకేతికవిద్యా డైరెక్టర్ సమావేశం - పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులపై చర్చ
శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులతో రాష్ట్ర సాంకేతికవిద్యా డైరెక్టర్ సమావేశం
- పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులపై చర్చ
రవి కిరణాలు న్యూస్ తడ (శ్రీసిటీ):
రాష్ట్ర సాంకేతిక విద్యా డైరెక్టర్, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ & ట్రైనింగ్ (SBTET) చైర్మన్ సి.నాగరాణి శుక్రవారం శ్రీసిటీలో పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పరిశ్రమలకు అనుగుణంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త కోర్సులు, పాఠ్యఅంశాల్లో మార్పులు చేర్పులకు సంబంధించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు పెట్టుబడులు ముఖ్య సలహాదారు ఆర్.వీరా రెడ్డి, సాంకేతిక విద్యాశాఖ జిల్లా అధికారులు, రాష్ట్రంలోని పలు పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పరిశ్రమ అవసరాలకు తగ్గ కోర్సులను ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం చేయడానికి చొరవ తీసుకున్నందుకు సాంకేతిక విద్యా డైరెక్టర్‌కు రవీంద్ర సన్నారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక కోర్సుల ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా వుందన్న ఆయన, సాంకేతిక విద్యాశాఖ, పాలిటెక్నిక్ కళాశాలలు, పరిశ్రమలు ఏకతాటిపైకి వచ్చి సమన్వయంతో పనిచేస్తే తప్ప కొత్త కోర్సుల లక్ష్యం నెరవేరదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కళాశాలలు, పరిశ్రమలు, ప్రభుత్వం భాగస్వామ్యంతో కూడిన ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చేందుకు శ్రీసిటీ ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
సాంకేతిక విద్యా డైరెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, పరిశ్రమ అవసరాలకు సరిపోయే ప్రత్యేక కోర్స్‌ల ప్రతిపాదనపై గత నెలలో శ్రీసిటీలో జరిగిన చర్చకు కొనసాగింపుగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డైనమిక్ ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు పెద్దఎత్తున తరలివస్తున్నాయని, పరిశ్రమలకు అవసరమైన మానవవనరులు సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ మేరకు కళాశాలలు, పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. శ్రీసిటీ మరియు పరిశ్రమల సానుకూల స్పందనను ప్రశంసించిన ఆమె, ఈ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
వివిధ రంగాల్లో ప్రత్యేక కోర్సులను ప్రారంభించేందుకు తమ శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్న ఆమె, కొత్త సిలబస్ తో కోర్సులను ప్రారంభించడం, CSR నిధులతో అత్యాధునిక యంత్రాలతో ల్యాబ్‌లను సమకూర్చడం, అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థులకు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌లు తదితర అంశాలపై పరిశ్రమలు కచ్చితమైన ఒప్పందం కుదుర్చుకోవాలని కోరారు.
సిలబస్‌ను నవీకరించడం, సంస్కరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించిన వీరారెడ్డి, కొత్త కోర్సులు భోదనకే పరిమితం కాకుండా ఆచరణాత్మక పరిజ్ఞానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సాంకేతిక విద్యాశాఖ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్న వివిధ డిప్లొమా కోర్సులపై ప్రత్యేక వివరణ ఇచ్చారు.
డైకిన్, అంబర్, బ్లూ స్టార్, హంటర్ డగ్లస్, ఇసుజు, వెంచర్, ఆల్‌స్టామ్, ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్, టోరే, ఇసుజు, టాటా ఫుడ్స్ తో సహా పలువురు పరిశ్రమ ప్రతినిధులు సమావేశానికి హాజరై తమ పరిశ్రమలలో మానవ వనరులకు కావలసిన నైపుణ్యాలు, ఇందుకు ప్రవేశపెట్టాల్సిన ప్రత్యేక కోర్సులను సూచించారు. దానికి సంబందించిన సహాయసహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.