నదుల పక్కన ఉన్న గ్రామాల్లో ఉచిత ఇసుక..ఎడ్ల బండితోనే అనుమతి!
ఏపీలో తీసుకొచ్చిన ఇసుక విధానం ద్వారా భవన నిర్మాణదారులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థిని సరిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.ఇప్పటివరకు కేవలం డిపోల ద్వారానే అమ్మకం చేస్తున్న ఇసుకను తీసుకెళ్లడంలో కాస్త సడలింపులు ఇచ్చారు. నదులకు సమీపంలో ఉన్నవారు ఎడ్ల బళ్ల ద్వారా స్వంతానికి ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.
చిన్న చిన్న నదుల నుంచి పక్కనే ఆనుకున్న గ్రామాలకు ఎడ్లబళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఇలా తీసుకెళ్లేవారు పంచాయతీ కార్యదర్శి వద్ద రిజిస్ర్టేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఎడ్ల బళ్ల ద్వారా తీసుకెళ్లి వేరేచోట్ల నిల్వచేసి అక్రమంగా తరలిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇసుక కొరత, అక్రమాలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఇసుక బుకింగ్ పోర్టల్ ఆన్ చేయగానే... నిల్వలు లేవన్నట్లుగా చూపిస్తున్న పరిస్థితిని సరిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. బల్క్ ఆర్డర్లను పోర్టల్ నుంచి తొలగించాలని, వీటికి అనుమతులను జాయింట్ కలెక్టర్లకు అప్పగించాలన్నారు.
ప్రభుత్వ బుకింగ్‌లకు సంబంధించి బల్క్ ఆర్డర్లు ఉంటే జేసీ, సూపరింటెండెంట్ ఇంజనీర్ల ద్వారా అనుమతులు ఇవ్వాలన్నారు. ఇసుక అక్రమాలు లేకుండా చేయాలని, డిపోల నుంచే ఇసుక సరఫరా చేయాలని, నియోజకవర్గం అంతా ఒకే ధర ఉండేలా చూడాలని నిర్దేశించారు. ఇసుక బుకింగ్ సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఉండాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఏపీఎండీసీ ఎండీ హరినారాయణన్ తదితరులు పాల్గొన్నారు.