సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ సంస్థలకు లైసెన్సు తప్పనిసరి


- నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాల జప్తు


- కమిషనర్ దినేష్ కుమార్




నగరంలోని సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సంస్థలు వ్యాపారం నిర్వహించుకోవడానికి ముందుగా కార్పొరేషన్ నుంచి లైసెన్సును పొందాలని, ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య ప్రమాణాల మేరకు తప్పనిసరిగా నడుచుకోవాలని కమిషనర్ దినేష్ కుమార్ స్పష్టం చేసారు. సెప్టిక్ ట్యాంక్ సంస్థల నిర్వాహకులు, పారిశుద్ధ్య కార్మికులతో కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే కార్మికులు రక్షణా ఉపకరణాలను కచ్చితంగా వాడాలని, కార్మికుల జీవన భద్రత కోసం అన్ని సంస్థలూ ఒక అసోసియేషన్ గా ఏర్పడాలని సూచించారు. నగరంలోని వెంకటేశ్వరపురం మురుగు నీటి శుద్ధి కేంద్రంలో మాత్రమే సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను విసర్జించాలని, ఇతర ప్రాంతాల్లో ఏలాంటి వ్యర్ధాలు విడుదల చేసినా వాహనాన్ని జప్తు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను తరలించే ప్రతీ వాహనం విధిగా లైసెన్స్ పొందడంతో పాటు ప్రయాణ మార్గాన్ని సూచించే జిపిఎస్ పరికరాన్ని కచ్చితంగా అమర్చుకోవాలని సూచించారు. సచివాలయాల శానిటేషన్ విభాగం ద్వారా సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ సేవలు అవసరమైన ప్రజల వివరాలను ఎప్పటికప్పుడు ఆయా క్లీనింగ్ సిబ్బందికి అందజేసి, శుభ్రం చేసే ప్రక్రియ ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తామని కమిషనర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రక్రియను పటిష్టంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఎస్ఈ సంజయ్, ప్రజారోగ్య శాఖ ఈఈ జానీ బాషా, పారిశుద్ధ్య విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.