పులులు గాలిలో ఎగిరేలా చేశాడు.. ఏనుగులు కనుమరుగయ్యేలా చేశాడు. ఒక్కొక్కసారి అతను పైతాన్‌లా మారేవాడు. ఎన్నో అద్భుతమైన కనికట్టు విద్యలు, మహిమలు ప్రదర్శించి.. తన ఇంద్రజాలంతో ప్రపంచ ప్రేక్షలను సమ్మోహితుల్ని చేసిన ప్రఖ్యాత ఇంద్రజాలకుడు రాయ్ హార్న్ కరోనా వైరస్‌తో కన్నుమూశాడు. లాస్ వెగాస్‌లో ఎంతో పాపులర్ అయిన రాయ్‌.. జంతువులతో ఎన్నో రకాల ఇంద్రజాల స్టంట్లు చేసవాడు. సీగ్‌ఫ్రైడ్ అనే మరో వ్యక్తితో కలిసి రాయ్ .. ప్రపంచవ్యాప్తంగా గొప్ప మ్యాజిషియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాయ్ వయసు 75 ఏళ్లు. రాయ్‌, సీగ్‌ఫ్రైడ్‌లు జంటగా 1967 నుంచి ఇంద్రజాలం చేస్తూ వస్తున్నారు. లాస్ వెగాస్‌లోని మిరేజ్ హోటల్‌లో ఆ ఇద్దరూ 14 ఏళ్ల పాటు అన్ని షోలను కిక్కిరిసిన ప్రేక్షకులతో నిర్వహించారు. 2003లో ఓ తెల్ల పులి దాడిలో గాయపడ్డ రాయ్‌.. అప్పటి నుంచి మ్యాజిక్ షోలు మానేశాడు. రాయ్‌కు కోవిడ్‌19 లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వారం క్రితమే కరోనా పరీక్షలో అతను పాజిటివ్‌గా తేలాడు. లాస్ వెగాస్‌లోని మౌంట్ వ్యూ హాస్పిటల్‌లో అతను తుదిశ్వాస విడిచాడు.