‘స్థానిక’ రిజర్వేషన్లపై హైకోర్టులో పిల్‌ వేసిన బిర్రు ప్రతాప్‌రెడ్డి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికలపై రేపు హైకోర్టులో విచారణ

ఈ నెల 17నే షెడ్యూల్‌ ప్రకటనకు సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌

సుప్రీంకోర్టు స్టేతో వాయిదా

50% మించిన రిజర్వేషన్లపై పలువురి అభ్యంతరాలు

ఎన్నికల నిర్వహణపై రేపు హైకోర్టులో విచారణ

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ సర్పంచ్‌లకు ఎన్నికల నిర్వహణపై రేపు స్పష్టత రానుంది. ఎన్నికలకు సంబంధించి రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ నెల 17నే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉండగా, సుప్రీంకోర్టు స్టే కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 28న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే విధిస్తూ.. ఈ విషయాన్ని రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో నలుగురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంతో వాటిపై రేపు విచారణ జరగనుంది. 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా.. 50 శాతానికే పరిమితం చేయాలా.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే అంశాలు హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉంటాయని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయ అధికారులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు చెప్పారు

50 శాతానికి పరిమితం చేస్తే బీసీలకు తగ్గనున్న పదవులు
పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో వివిధ పదవులకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన 59.85 శాతం రిజర్వేషన్లను హైకోర్టు 50 శాతానికి పరిమితం చేస్తే ఆ మేరకు 9.85 శాతం రిజర్వేషన్లను బీసీలకు తగ్గించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రాజ్యాంగం ప్రకారం.. ఎస్టీ, ఎస్సీలకు రాష్ట్రంలో వారి జనాభా నిష్పత్తి ప్రకారం 6.77 శాతం ఎస్టీలకు, 19.08 శాతం ఎస్సీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీలకు పోగా బీసీలకు 24.15% మేర రిజర్వేషన్లు కల్పించడానికి వీలుందని చెప్పారు. కాగా, 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు.