సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు
విశాఖ పోర్టు ట్రస్టు 2019-20 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 72.72 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. 2018-19లో 65.30 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరిగింది. ప్రస్తుతం 11శాతం పెరిగిందని విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్ మోహన్రావు తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో విశాఖ పోర్టు ట్రస్ట్ 32.77 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసినట్లు ప్రకటనలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 34.75 మిలియన్ టన్నుల రవాణా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.98 మిలియన్ టన్నుల తక్కువ సరుకు రవాణా ఉంది.
గతేడాది తొలి అర్ధభాగంతో పోలిస్తే 5.7 శాతం తక్కువ. సరుకు రవాణాలో తగ్గుదల పరంగా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అన్ని ఇతర నిర్వహణా స్థానాల కంటే తక్కువ క్షీణతను నమోదు చేసిందని పేర్కొన్నారు. విశాఖ పోర్టు ట్రస్టు 2019 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో మొత్తం 1056 , ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 1016 నౌకలను ట్రస్టు నిర్వహించినట్లు వివరించారు. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఇప్పటి వరకు బొగ్గు, ఇనుము రవాణా తదితర కార్గో సేవలు అందిస్తోంది. పూర్తిగా ఆటోమేటెడ్ చేసేందుకు పీపీపీ విధానంలో రూ.2,000 కోట్లు ఖర్చు చేసిందని ప్రకటనలో తెలిపారు.