మేకపాటి పార్థివదేహానికి శ్రీసిటీ ఎండీ స్మృత్యంజలి

 రవి కిరణాలు న్యూస్ (శ్రీసిటీ) :

దివంగత రాష్ట్ర  పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ. మరియూ నైపుణ్యాభివృద్ధి శాఖామాత్యులు  మేకపాటి గౌతమ్ రెడ్డి గారి పార్థివదేహానికి శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి అంజలి ఘటించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని, ప్రత్యేకించి ఆయన శ్రీసిటీ పారిశ్రామిక అభివృద్ధికి అందించిన సహాయ సహకారాన్ని, పరిశ్రమల యాజమాన్యాలతో తరచూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సంప్రదిస్తూ... ప్రభుత్వం తరఫున వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలోనూ  ఎంతో చొరవ చూపేవారని గుర్తు చేసుకున్నారు.  మరీ ముఖ్యంగా కోవిడ్ క్లిష్టసమయంలో  పరిశ్రమలు నిరాటంకంగా నడపడానికి ఆయన చూపిన చొరవ మరువలేనిదని అన్నారు.  వారం క్రితం జరిగిన దుబాయ్ ఎక్స్పోలో ఆంధ్రప్రదేశ్ తరఫున పెట్టుబడుల కోసం  గౌతమ్ రెడ్డి నాయకత్వంలో వెళ్ళిన బృందంలో తాను పాల్గొనవలసి వున్నా కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా హాజరు కాలేక పోయానని అన్నారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఎంతో పాటుబడ్డ గౌతమ్ రెడ్డి, చివరి క్షణం వరకూ రాష్త్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయనలేని లోటు  ఎవరు పూడ్చలేనిదని రవీంద్ర సన్నారెడ్డి  ఆవేదన వ్యక్తపరిచారు.
గౌతమ్ రెడ్డి గారి తండ్రి శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారిని పరామర్శిస్తూ,  మేకపాటి కుటుంబంతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని, మరీ ముఖ్యంగా గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఊహించని ఈ అపార దుఖాన్ని తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి ఇవ్వాలని భగవంతుని ప్రార్థించారు.