నేటి నుంచే వైయస్సార్ పెన్షన్ కానుక పెంపు రూ.250 పెంపుతో నెలకు రూ.2500
జిల్లాలో కొత్తగా 8449 పింఛన్లు మంజూరు
మురిసిపోతున్న అవ్వా తాతలు
....................................................

నెల్లూరు, డిసెంబర్ 31:
 నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం పెంచిన పింఛన్ మొత్తాన్ని నేటి నుంచి లబ్ధిదారులకు అందజేసేందుకు జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ముఖ్యమంత్రి సందేశం వినిపించిన తర్వాత పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
   వృద్ధులకు ప్రతి నెల అందజేసే పింఛన్ మొత్తాన్ని 2250 నుంచి 2500 రూపాయలకు పెంచడంతో వృద్ధుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమకు పెద్ద పండుగ ముందుగానే వచ్చిందని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ప్రతి నెలా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు,  కల్లు గీత కార్మికులు, చర్మకారులు, నేతన్నలకు అందజేసే పింఛను మొత్తాన్ని క్రమక్రమంగా మూడు వేల రూపాయల వరకు పెంచుతానని ముఖ్యమంత్రి ఇచ్చిన మాట వారికి నిజమైన భరోసాగా నిలుస్తుంది. సీఎం ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత 2000 రూపాయలు ఉన్న పింఛన్ ను 250 రూపాయలు పెంచి 2250 రూపాయలు  అందజేస్తుండగా నూతన సంవత్సర కానుకగా నేటి నుంచి మరో 250 రూపాయలు పెంచి అక్షరాల 2500 రూపాయలు పింఛన్ మొత్తాన్ని అందజేస్తానని ముఖ్యమంత్రి ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 15 రకాల పింఛన్లను 3,58,387 మంది లబ్ధిదారులకు రూ. 84,45,58,750 అందజేస్తుండగా  ప్రస్తుతం రూ. 2250 పొందుతున్న  3,10,362 మంది లబ్ధిదారులకు పెరిగిన పింఛన్ తో మేలు చేకూరనుంది. అలాగే జిల్లాలో కొత్తగా 8449 పింఛన్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. 

 దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటికే వెళ్లి వాలంటీర్లు టంఛన్ గా పింఛన్ అందించడంతో ఇంతకంటే తమను ఇంకెవరు బాగా చూసుకుంటారని... ఈ డబ్బులు తమకు కొండంత అండగా ఉపయోగపడుతున్నాయని, ఎవరి దగ్గర చేయి చాపకుండా ఆత్మాభిమానంతో జీవిస్తున్నామని, మా ఇంటి పెద్ద కొడుకులా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మా బాగోగులు చూసుకుంటున్నాడని లబ్ధిదారులు ఆనందంతో చెబుతున్నారు. 

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్
- సాంబశివారెడ్డి, డిఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్
...................................................... 
పెరిగిన పింఛన్ తో వృద్ధులు మరింత ఆనందంగా జీవించగలుగుతారు. లబ్ధిదారులకు సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికభారం అయినప్పటికీ వృద్ధులు మరింత మెండుగా జీవించేలా పింఛన్లు పెంచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తున్నామని, ఇంకా ఎవరైనా అర్హత ఉండి పింఛన్ రాకపోతే సమీప సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 
.................................