అక్రమ వ్యాపారాలు యధాతధం! కట్టడి చేయలేని అధికార గణం
దొరవారి సత్రం.. రవికిరణాలు...అక్రమ వ్యాపారాలు యధాతధం! కట్టడి చేయలేని అధికార గణం:- ప్రజాస్వామ్యంలో పాలకుల పెత్తనం సాగుతోంది. ప్రజా పాలనలో భాగస్వాములైన ప్రభుత్వ పాలన అధికారులు నిమిత్తమాత్రులుగా మారుతున్నారు. కిందిస్థాయి అటెండర్ నుండి పై స్థాయి అధికారి దాకా ప్రజా ప్రతినిధుల ఆదేశాలు ఉల్లంఘించి న్యాయం వైపు మొగ్గుచూపులేని పరిస్థితి ఉందనే ప్రజాభిప్రాయం. నిజాయితీగల అధికారులు ముక్కు సూటి పాలన సాగించాలనే సాహసించే వారికి స్థాన చలనం తప్పడం లేదు. పేదలవైపు న్యాయమున్న ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మౌనంగా ఉద్యోగ భద్రతను కాపాడుకోవాల్సిందే. నీతి, నిజాయితీ, న్యాయం, అనే మాటలను కార్యరూపు దాల్చానీయకుండానే కొందరు నీటి మీద రాతలుగా చెరిపేస్తున్నారు. ఇంకొందరికి అవినీతి రంగు పూసి అక్రమణదారులు అడ్డు రాకుండా ఆ కట్టుకుంటున్నారు. నాడు ఉండిన న్యాయం నేడు లేదనే పలువురి వాదన ఉంది. అధికారుల్లోనే కొందరు ధన దాహానికి దాసోహమై అక్రమార్కులకు కొమ్ము కాస్తూ అపర కుబేరులుగా మారుతున్నారు. ప్రతి ప్రాంతంలోనూ, ప్రతి శాఖలోనూ, అవినీతికి తావు లేదనే నోరు విప్పి చెప్పలేని పరిస్థితి ఉంది. భారీగా జరిగే అవినీతి వ్యాపారాలను అడ్డుకోవాలని చేసే ఏ అధికారి ప్రయత్నం అయినా సత్ఫలితాలు సాధించలేక, పలుమార్లు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు రానే వస్తున్నాయి. అంతర్జాతీయ అక్రమ వ్యాపారాలుగా ఎర్రచందనం, మత్తును కలిగించే హెరాయిన్, కొకిన్, గంజాయి, వంటి రవాణాను కొందరి అధికారులు పలుమార్లు పట్టుకుంటున్న ఏదో ఓ మార్గంలో, ఎవరో ఒకరు సమాచార సహకారాలతో ఈ అంతర్జాతీయ అక్రమ వ్యాపారాలు మాత్రం పూర్తిస్థాయి కట్టడి చేయలేకున్నారు. అలా బడా బాబులు ఆ వ్యాపారాలతో అపర కుబేరులు అవుతుంటే, మన జిల్లా, మన మండలం, మన గ్రామం ప్రాంతాల్లో ఊరుకో మైనింగ్ మాఫియాలీడర్లు తయారయ్యారు. వారికి ఈ ప్రభుత్వం నిబంధనలు వర్తించవు, వారికి తెలిసిందల్లా అక్రమ వ్యాపారాలతో అధిక ధనార్జనే వారు లక్ష్యంతో చీకటి వ్యాపారాలు సాగిస్తున్నారు. ప్రధానంగా అనుమతి లేని ఇసుక రీచ్ లో, త్రవ్వకాలకు పరిమిషన్ లేని నదుల్లోని ఇసుకను తోడుస్తూ పొరుగు రాష్ట్రాలకు తరలించి వ్యాపారం సాగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా సాగునీటి చెరువులు, ప్రభుత్వం భూముల్లో పుష్కలంగా ఉన్న గ్రావెల్ తవ్వకాలు చేస్తూ కాసుల పోగేసుకుంటున్నారు. మైనింగ్ మాఫియా ఈ ప్రాంతాల్లో నిత్యం చీకటి వ్యాపారాలుగా కొనసాగుతున్నాయి. అడ్డొచ్చే అధికారికి నయాను భయానో మచ్చిక చేసుకోవడం, లేదంటే రాజకీయ పలుకుబడితో ఆ అధికారి పవర్ కు చెక్ పెడుతూ అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారు. నియోజకవర్గంలోనే దొరవారి సత్రం, సులూరుపేట, తడ, నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి, మండలాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతుందని విమర్శలు లేకపోలేదు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగంలో పలు శాఖాధిపతులు ఉన్న పట్టించుకోకపోవడంతో వారు కూడా అక్రమ వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాపారుల ద్వారా చదునైన భూములు లోతైన గుంతలుగా మారుతున్నాయి. సాగునీటి చెరువులు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. భూగర్భ జల నిల్వలకు దోహదపడే ఇసుక పొరలు లోతుగా లోడేయడంతో భూగర్భ జలాలకు గండిపడి బోరు బావులు ఏ కరవు పెడుతున్నాయి. ఈ అక్రమ వ్యాపారాలను అడ్డుకోవలసిన అధికార గణం ఏమైందని ప్రజానీకం ప్రశ్నగా ఉంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఏ అధికారైనా వారి అధికారానికి పదును పెట్టి అక్రమ వ్యాపారుల భరతం పట్టాలనే ప్రజానీకం కోరుకుంటున్నారు.