లాకడౌన్‌ సడలింపులు ఇచ్చిన తర్వాత తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ వైరస్‌ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరం పాటిస్తూ.. దర్శనానికి అవకాశం కల్పించారు. అయినా కూడా కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా టీటీడీలో 10 మందికి వైరస్‌ సోకింది. వీరిలో స్వామివారికి పూజా కైంకర్యాలు చేసే అర్చకుడు కూడా ఉన్నారు. వెంటనే అధికారులు అప్రమత్తమై శానిటైజేషన్‌ పనులు పూర్తి చేశారు. వైరస్‌ సోకిన వారిలో నలుగురు సన్నాయి వాయిద్యకారులు, ఓ అర్చకుడు,ఐదుగురు సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టు వెల్లడించారు. దశల వారీగా ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేస్తుండగా.. తాజాగా వీరి శాంపిల్స్‌ను పరీక్షించారు. అందులో పాజిటివ్‌ అని తేలింది. వారందరినీ వెంటే ఆసుపత్రులకు తరలించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తులందరికీ అలిపిరిలోనే థర్మల్‌ స్కీన్రింగ్‌ ను చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్నవారిని పైకి అనుమతించడం లేదు.