నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీ మేకపాటి గౌతం రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబుతో కలిసి కోవిడ్ -19 టాస్క్ ఫోర్స్ సమావేశం, జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షా, సమావేశం నిర్వహించారు. కోవిడ్ -19 మహమ్మారి నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఆస్పత్రులలో బెడ్స్ కొరత ఉందని, నర్సింగ్ సిబ్బంది కొరత ఉందని తెలుస్తోందని.., వాటిని పరిష్కరించాలన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయనే సమాచారం.., ప్రతిరోజూ మీడియా ద్వారా ప్రజలకు తెలిసేలా పత్రికా ప్రకటన ఇవ్వాలన్నారు. ఆస్పత్రిలో చేరిన పేషంట్స్ సపోర్టుగా సిబ్బందిని నియమించాలన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో సంభవించిన కోవిడ్ మరణాలకు కారణాలను నిపుణుల కమిటీతో పరిశీలించి, కారణాలు తెలుసుకోవాలన్నారు. గత నాలుగు నెలలుగా కరోనా మహమ్మారి కారణంగా జిల్లాలో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడిందని.., దీనిని అధిగమించి రాబోయే రోజుల్లో రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాల్లో టాప్ 3 లో నెల్లూరు జిల్లాను నిలపడమే లక్ష్యంగా అందరం కృషిచేయాలన్నారు.
ఈ సమీక్షా, సమావేశంలో కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ.., జిల్లాలో 30 లక్షల జనాభా ఉందని, ఇప్పటి వరకూ 29,782 పాజిటివ్ కేసులు నమోదవగా,22, 419 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని మంత్రికి తెలిపారు. . హోం ఐసోలేషన్ ఉన్న వారికోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, వారికి ఎలాంటి సహాయం కావాలన్నా 104 కి కాల్ చేస్తే తక్షణం అక్కడికి వెహికల్ పంపించి, అవసరమైతే వారిని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు కూడా చేశామన్నారు.
ఈ సమీక్షా, సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.., ఐ.సి.యూ. లో చికిత్స పొందుతున్న పేషంట్స్ భోజనం చేసే స్థితిలో లేకపోతే, వారికి ఐ.వీ. ఫ్లూయిడ్స్ ద్వారా ఆహారం అందిస్తున్నామని, వారికి బెడ్ మీదనే ఇన్-అవుట్ సదుపాయాలు కల్పించామనన్నారు.
ఈ సమీక్షా, సమావేశంలో  ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, డి.ఎఫ్.ఓ  షణ్ముఖ్ కుమార్, జెడ్పీ సి.ఈ.ఓ. పి. సుశీల, డి.ఎం.హెచ్.ఓ  రాజ్యలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి , నాగలక్ష్మి,  డిఆర్డిఎ పిడి రోజ్ మాండ్ జి.జి.హెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి, నోడల్ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, అధికారులు పాల్గొన్నారు.