తమిళ పాలిటిక్స్ లో మంగళవారం ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. చిన్నమ్మగా పేరు పొందిన అన్నాడీఎంకే బ‌హిష్కృత నాయ‌కురాలు


వీకే శశికళ..సూపర్​స్టార్​ రజనీకాంత్​ను చెన్నైలోని ఆయన నివాసంలో మంగళవారం సాయంత్రం కలిశారు. రజనీకాంత్​, ఆయన సతీమణి లతా రజనీకాంత్​తో ముచ్చటించారు.


 ఇటీవల దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు గానూ రజనీకాంత్​ను శశికళ శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీ​ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు శశికళ. అయితే సోమవారమే అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్​ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పార్టీ బైలాస్​ను సవరించి, శశికళ మళ్లీ చక్రం తిప్పేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడంలో ఓపీఎస్​, ఈపీఎస్​ సఫలమయ్యారు. 


 అన్నాడీఎంకేలో ప‌దవుల పందేరం పూర్తై, శ‌శిక‌ళ‌కు చుక్కెదురైన సమ‌యంలోనే సూప‌ర్ స్టార్‌ను చిన్నమ్మ క‌లుసుకోవ‌డం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, శశికళ కొత్త రాజకీయ పార్టీ స్థాపించే అవకాశం ఉందంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్న క్రమంలో  కొత్తగా ఏర్పాటుచేయబోయే పార్టీకి మద్దతును కోరేందుకే శశికళ రజనీని కలిసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.