కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మరోసారి బరిలోకి దిగుతానని ఎమ్మెల్సీ రామకృష్ణ ప్రకటించారు. ఈ సారి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. 2015 మార్చిలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1800 ఓట్ల మెజారీటీతో గెలిచానని గుర్తు చేశారు. ఆ సమయంలో తనకు అందరూ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఏ ఆశయాలతో అయితే ఉపాధ్యాయులు తనను ఎన్నుకున్నారో వాటి సాధన కోసం నిరంతరం కృషి చేశానని చెప్పుకొచ్చారు. పాఠశాలల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి ఉపాధ్యాయుల అభివృద్ధి కోసం పని చేశానని అన్నారు. కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయులు తనను మళ్లీ గెలిపిస్తే గతం కంటే రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తానని రామకృష్ణ పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.