గత వారం రోజులుగా జయప్రకాశ్‌ రెడ్డి కాస్త నీరసంగా ఉన్నారని ఆయన భార్య రాధ తెలిపారు. కేవలం షుగర్‌ డౌన్‌ అయ్యిందని, అంతకు మించి సమస్యలు ఏమీ లేవని ఆమె మీడియాతో పేర్కొన్నారు. 'ఈ రోజు ఉదయం 3.30 గంటలకు నిద్రలేచారు. ఏ భాగంలోనూ నొప్పి ఉందని అనలేదు. పిల్లలతో మాట్లాడాలి అన్నారు. 'ఇప్పుడే ఎందుకు..? ఆరు గంటల సమయంలో మాట్లాడుదాం, లేదు ఇప్పుడే మాట్లాడాలంటే చెప్పండి ఫోన్‌ చేసి ఇస్తా' అని చెప్పా. వద్దులే.. బాత్‌రూమ్‌ వెళ్లి వచ్చి మాట్లాడతా అన్నారు. అంతే.. అక్కడికి వెళ్లి, కళ్లు తేలేశారు. నేను పైకి వెళ్లి డాక్టర్‌ను పిలిచా. ఆయన వచ్చి, ప్రాణాలు లేవమ్మా అన్నారు. ఇదంతా ఐదు నిమిషాల్లోనే జరిగిపోయింది. గతంలో మా ఆయనకు స్టంట్స్‌ వేశారు. కానీ వారం రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్లి సాధారణ చెక్‌అప్‌ చేయించుకున్నారు. అంతా బాగుందని వైద్యులు చెప్పారు'.
'గత మంగళవారం నుంచి కాస్త అనారోగ్యంగా ఉన్నారు. షుగర్‌ డౌన్‌ అయ్యిందంతే.. అంతకు ముందు హుషారుగానే ఉన్నారు. అందరితో ఫోన్లలో మాట్లాడారు. వారం రోజుల నుంచి కాస్త నీరసంగా ఉన్నారు.
ఆయన ఏడాదిన్నర క్రితమే గుంటూరు వచ్చేశారు. ఎవరైనా పాత్రలు చేయమని బలవంతం చేస్తే షూటింగ్‌కి వెళ్లి, వచ్చేవారు. కొత్త నటీనటులకి అవకాశం ఇవ్వాలి అనేవారు' అని రాధ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం జయప్రకాశ్‌ రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన హఠాన్మరణం సినీ ప్రముఖులతోపాటు అభిమానుల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.