: రైతుల ఉద్యమం దేశానికే ఆదర్శం
ఐసిడిఎస్ రీజియన్ మాజీ చైర్ పర్సన్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి
రైతుల ఉద్యమం దేశానికే ఆదర్శమని, అన్నం పెట్టే రైతులను అణగదొక్కడం, వారిని క్షోభకు గురిచేయడం వైసిపి ప్రభుత్వానికే చెల్లిందని తెలుగుదేశం నాయకురాలు, ఐసిడిఎస్ రీజియన్ మాజీ చైర్ పర్సన్ గుంటుపల్లి శ్రీదేవి చౌదరి విమర్శించారు. టిడిపి ఆధ్వర్యంలో ఉద్దండరాయన పాలెంలో అమరావతి రైతులకు మద్దతుగా గురువారం జరిగే కార్యక్రమానికి కావలి నుండి వెళ్ళడానికి సిద్దమైన శ్రీదేవి చౌదరికి హౌస్ అరెస్టు నోటీసును కావలి రెండవ పట్టణ పోలీసులు బుధవారం రాత్రి అందజేశారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మాట్లాడుతూ 5కోట్ల మంది ఆంధ్రులు కలలుగన్న అమరావతిని కొనసాగించి ఉంటే రాష్ట్రానికి సంపద సృష్టించేదిగా విలసిల్లేదని, 175 నియోజకవర్గాలకు సరిపడా నిధుల ప్రవాహం సృష్టించేదని, భూములు తీసుకున్న 130 సంస్ధలు వచ్చి పెట్టుబడులు పెట్టి ఉంటే హైదరాబాద్ కు ధీటుగా అన్ని విధాలా అమరావతి ఉండేదని, 13జిల్లాల యువతకు పుష్టిగా ఉద్యోగ అవకాశాలు లభించేవని తెలిపారు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోలేక ప్రజలపై రోజుకొక పన్ను విధించి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. ఇటీవల వచ్చిన వరదలలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి మహా నగరాలు మునిగినా అమరావతిలో చుక్క నీరు నిలవలేదని తెలిపారు. ఇప్పటికే రాజధానికి భూములు ఇచ్చి 109 మంది రైతులు చనువు చాలించారని, ఉద్యమాన్ని అణగదొక్కాలని 2661 మంది రైతులు, కూలీలపై క్రిమినల్ కేసులు పెట్టారని, చనిపోయిన మహిళలను కూడా వదలకుండా కేసులు పెడుతున్నారని తెలిపారు. ఆచరణ సాధ్యం కాని మూడు రాజధానుల అంశాన్ని తీసుకొచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు వైసిపి నేతలు అమరావతే రాజధానిగా ఉంటుందని, మార్చబోమని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రజా రాజధానిగా అమరావతిలో అనేక కార్యక్రమాలు టిడిపి ప్రభుత్వంలో చేపట్టడం జరిగిందని, ప్రస్తుతం నిలిచిపోయిన అభివృద్ధి పనులు చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని, హైకోర్టు కూడా ఆవేదన వ్యక్తం చేసినదని తెలిపారు.