ప్లాస్టిక్ రహిత నెల్లూరుకై కృషి చేద్దాం 


- కమిషనర్ దినేష్ కుమార్







పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిస్థాయిలో నిషేధించి నెల్లూరు నగరాన్ని ప్లాస్టిక్ రహిత సుందర నగరంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ దినేష్ కుమార్  తెలిపారు. నగరంలోని ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయదారులు , వ్యాపారస్తులు, నగర ప్రముఖులతో సమావేశాన్ని కమిషనర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నూతన నిర్ణయాలతో రాబోయే రోజుల్లో 75 శాతం కన్నా తక్కువ మైక్రాన్ ప్లాస్టిక్ ఉత్పత్తులను విక్రయించడం, వినియోగించడం నెల్లూరు నగరంలో నిషేధించనున్నామని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదేశించిన నిబంధనలను అతిక్రమించిన విక్రయదారులు, వినియోగదారులపై భారీ జరిమానాతో కూడిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్లాస్టిక్ సంచులకు ప్రత్యామ్నాయంగా జౌళి ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, వాటి వినియోగానికి అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను నగరపాలక సంస్థ నుంచి అందిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, నగరపాలక సంస్థ సిబ్బంది, నగరంలోని  వ్యాపారస్తులు,  తదితరులు పాల్గొన్నారు