ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర


కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో 13 జిల్లాలను మొత్తం 26 కొత్త జిల్లాలుగా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి రేపు (మంగళవారం) లేదా ఎల్లుండి (బుధవారం) నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తోంది.


 ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్టు ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. అయితే ఈ హామీని నెరవేర్చే దిశగా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఈ ఎన్నికల హామీకి సంబంధించిన నోటిఫికేష‌న్ జారీ చేయనున్నట్టు సమాచారం. మరో రెండురోజుల్లో నోటీఫికేష‌న్ జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి.


 అరకును రెండు జిల్లాలుగా.. 


 రాష్ట్రంలో మొత్తంగా 25 లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. అందులో 26 కొత్త జిల్లాలు ఏర్పాటుకు ప్ర‌క్రియ‌ ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తోంది. అర‌కు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ భౌగోళిక రిత్యా చాలా విస్తార‌మైనది. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని భౌగోళిక ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని మార్పులు- చేర్పులు చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.


 స్థానిక వైసీపీ నేతల అభిప్రాయాలు.. అధికారుల నివేదికలు అన్నింటినీ లెక్కలు వేసుకుని ఫైనల్‌గా 26 జిల్లాలు ఉండేలా కసరత్తు చేసినట్టు సమాచారం. గతంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై స్టేట్ లెవల్ కమిటీ, సబ్ కమటీలు, డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలు కొత్త జిల్లాలపై సమావేశాలను నిర్వహించాయి. ఆ నివేదికల ఆధారంగానే జగన్ సర్కార్ 26 కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.