SEB నెలవారి నేర సమీక్ష సమావేశం:- అక్రమ రవాణా పై ఉక్కు పాదం.
SEB నెలవారి నేర సమీక్ష సమావేశం:-
అక్రమ రవాణా పై ఉక్కు పాదం.
➡️ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ విధులను విస్తృతంగా పెంచి, ముమ్మరంగా తనిఖీలు చేపట్టాలి.
➡️ ముందస్తు సమాచార వ్యవస్థను, నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుని ఆకస్మికంగా దాడులు నిర్వహించాలి.
➡️ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు ల యందు 24/7 నిరంతరం తనిఖీలు నిర్వహించే విధంగా క్రమబద్ధమైన ప్రణాళిక.
➡️ జిల్లా నుండి గానీ, జిల్లా మీదుగా కానీ ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా జిల్లా టాస్క్ ఫోర్సును మరింత బలోపేతం చేసి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి.
➡️ జాగ్రత్తగా పకడ్బందీగా చట్టప్రకారం విధులు నిర్వర్తించాలి, అనవసరమైన విషయాలలో తల దూర్చరాదు అని SEB అధికారులకు దిశా నిర్దేశం.
జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,
శనివారం నాడు స్థానిక పోలీసు అతిథిగృహం సమావేశ మందిరం నందు జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు జిల్లాలోని SEB అధికారులతో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో సాధారణ బదిలీలలో భాగంగా నూతనంగా తిరుపతి జిల్లాకు వచ్చిన SEB అధికారులతో ముఖ పరిచయం చేసుకుని తిరుపతి జిల్లా యొక్క భౌగోళిక, సాంస్కృతిక విశిష్టతను గురించి జిల్లా ఎస్పీ గారు సవివరంగా వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు మాట్లాడుతూ దేశంలోని రెండు మహానగరాలు అయిన చెన్నై బెంగళూరు లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అనుసంధానించే కీలకమైన సరిహద్దు జిల్లాగా తిరుపతి జిల్లా ఉన్నది. అదే సమయంలో ఆ మహానగరాల నుండి జిల్లా మీదుగా రాష్ట్రంలోకి మద్యం, నాటు సారా, మత్తు పదార్థాలు, నగదు వంటి అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి సాంప్రదాయక వేగు వ్యవస్థను క్షేత్రస్థాయిలో పటిష్ట పరచుకుని ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా సమూలంగా అడ్డుకోవాల్సిన బాధ్యత మనదేనన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రానున్న నాలుగు నెలలు అత్యంత కఠిన తరంగా ఉంటాయి. అయినా కూడా సునాయాసంగా ఆ సవాళ్లు అన్నింటినీ ఎదుర్కొని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సమర్థవంతంగా చట్టబద్ధంగా తమ విధులను నిర్వర్తించాలి. అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించి SEB శాఖకు చెడ్డపేరు తీసుకురావద్దని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
జిల్లాలోని బార్ అండ్ రెస్టారెంట్ల యొక్క గత ఆరు నెలల ఇండెంట్ లను సదరు S.H.O లు తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏమైనా అవకతవకలను గుర్తించిన ఎడల ఆకస్మిక దాడులు నిర్వహించి అక్రమ మద్యం అమ్మకాలను నిలువరించాలన్నారు.
ఎన్నికల నియమావళి నిబంధనల మేరకు రాష్ట్ర సరిహద్దుల వెంబడి అవసరమైన నూతన చెక్పోస్టులను ఏర్పాటు చేసి అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే రాష్ట్రంలోకి అనుమతించాలి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే అదుపులోకి తీసుకొని సమగ్రంగా దర్యాప్తు చేయాలన్నారు. అంతేకాకుండా రైళ్ల ద్వారా ఇటీవల కాలంలో అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉన్నది కాబట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా టాస్క్ఫోర్స్ మరియు పోలీస్ శాఖలవారు సమన్వయంగా రైళ్ల యందు విస్తృతంగా తనిఖీలు నిర్వర్తించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని అన్నారు.
ఇంటెలిజెన్స్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, టెక్నికల్ విభాగాల వారు స్థానిక పోలీస్ వారితో ఎల్లవేళలా అనుసంధానంగా పనిచేస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా వ్యాప్తంగా విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన SEB అధికారులు మరియు సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు ప్రశంసా పత్రాలను అందజేసి, అభినందించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా SEB అదనపు ఎస్పీ శ్రీ రాజేంద్ర, తిరుపతి ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, గూడూరు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రమేష్, జిల్లాలోని SEB ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.