చెత్త నుంచి సంపద సృష్టించడానికి సహకరించండి - కమిషనర్ దినేష్ కుమార్
చెత్త నుంచి సంపద సృష్టించడానికి సహకరించండి
- కమిషనర్ దినేష్ కుమార్
క్లీన్ ఆంధ్రప్రదేశ్ (CLAP) కార్యక్రమంలో భాగంగా పటిష్టమైన ప్రణాళికలతో ప్రతీ ఇంటి నుంచి చెత్తను సేకరించి, శాస్త్రీయ విధానంలో చెత్తనుంచి సంపద సృష్టించేందుకు విధానాలు అమలు చేస్తున్నామని, ప్రజలంతా సహకరించాలని నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగం అధికారులు, సచివాలయ కార్యదర్శులు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు పనిభారం తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన వాహనాలను సమకూర్చుతోందని, ఆయా వాహనాల ద్వారా తడి, పొడి చెత్తలను వేరు వేరుగా సేకరించగలమని తెలిపారు. తడి చెత్తను సేంద్రీయ ఎరువులుగా, పొడి చెత్తను రీ సైకిల్ చేసి నూతన ఉత్పత్తుల తయారీకి, ప్లాస్టిక్ వ్యర్ధాల నుంచి ఇంధనాలను ఉత్పత్తి చేసే అధునాతన యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నామని కమిషనర్ వివరించారు. నగర పాలక సంస్థ పరిధిలోని 167 సచివాలయాలకు ఒక్కో వాహనం వంతున అందజేసి, ప్రతీ ఇంటినుంచి నిర్దిష్ట సమయంలో చెత్తను సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. జులై నెల 8 వ తేదీన తొలి విడతగా కొన్ని వాహనాలు కార్పొరేషన్ కు చేరుకుంటాయని, అప్పటినుంచి చెత్త సేకరణ పనులు వేగవంతం చేస్తామని కమిషనర్ ఆకాంక్షించారు. స్వచ్ఛ నెల్లూరు సాకారానికి నగర ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, తమ వంతు బాధ్యతగా పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి దోహద పడాలని ఆయన కోరారు. అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రోజుకు రూ.4/- వంతున ప్రతీ ఇంటికి, స్లమ్ ప్రాంతాల్లో రోజుకు రూ.2/-- వంతున యూసర్ ఛార్జ్ వసూలు చేసేలా విధానాలు రూపొందించామని కమిషనర్ స్పష్టం చేసారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ప్రసాద్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, సెక్రటరీ హైమావతి తదితరులు పాల్గొన్నారు.