జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వరదలు కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం సభ్యులు రెండు బృందాలుగా రేపు 28వ తేదిన ఆదివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన నష్టాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయడంతో పాటు, బృందం సభ్యులు పర్యటించు ప్రదేశాల్లో సంబంధించిన నివేదికలతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని శంకరన్ హాల్ లో జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జిల్లా అధికారులతో సమావేశమై కేంద్ర బృందం పర్యటన ముందస్తు ఏర్పాట్లుపై సమీక్షించి, పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర బృందం సభ్యులు రెండు బృందాలుగా జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో అందుకనుగుణంగా అధికారులు ఆయా శాఖలకు సంబంధించి జరిగిన నష్టాలపై సమగ్ర నివేదికలతో కేంద్ర బృందం సభ్యులకు సవివరంగా వివరించేందుకు సిద్దంగా ఉండాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరిగిన ప్రతి నష్టాన్ని కేంద్ర బృందం సభ్యుల దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్, జిల్లా అధికారులను ఆదేశించారు.
జరిగిన నష్టాలపై, వరద బాధితులకు చేపట్టిన సహాయ కార్యక్రమాలపై ఏర్పాటు చేయు ఫోటో ఎగ్జిబిషన్ ను ఒక ప్రాధాన్యత రూపంలో చక్కగా ఏర్పాటు చేయాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
అల్పపీడనం కారణంగా జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్న నేపధ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో జరుగుచున్న సహాయక కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. వచ్చే నెల డిశంబర్ 15వ తేది వరకు ఎన్.డి.ఆర్.ఎఫ్., ఎస్.డి.ఆర్.ఎఫ్. బృందాలను జిల్లాలోనే ఉంచాలని కలెక్టర్, జిల్లా రెవిన్యూ అధికారిని ఆదేశించారు. 24 X 7 కంట్రోల్ రూం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. 104 టోల్ ఫ్రీ నెంబర్ మరో నెల రోజులపాటు డిజాస్టర్ రిలీఫ్ కొరకు పనిచేస్తుందని, ప్రజలు ఈ నెంబర్ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేందిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ విధేహ్ ఖరే, శ్రీమతి రోజ్ మాండ్, మునిసిపల్ కమీషనర్ శ్రీ దినేష్ కుమార్, అడిషనల్ ఎస్.పి. శ్రీమతి వెంకటరత్నం, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు, నెల్లూరు ఆర్.డి.ఓ శ్రీ హుసేన్ సాహెబ్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖ , ఆర్.డబ్ల్యు. ఎస్., ఆర్ అండ్ బి, హౌసింగ్, ఉద్యానశాఖ, మత్స్య శాఖ, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.