ధూమపానం చేయని వారికే ఉద్యోగాలు ఇవ్వాలని జార్ఖండు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండు ప్రభుత్వం తన కార్యాలయాలను పొగాకు రహిత మండలాలుగా ప్రకటించింది. తాము ధూమపానం చేయమని, పొగాకు నమలమని పేర్కొంటు ఉద్యోగులు అఫిడవిట్లను దాఖలు చేయడం తప్పనిసరి చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరబోయే వారు కూడా తాము ధూమపానం చేయమని, పొగాకు తినబోమని అఫిడవిట్లు సమర్పించాలి.

2021 ఏప్రిల్ నుంచి ఈ నిబంధనను జార్ఖండు సర్కారు అమలులోకి తీసుకువచ్చింది. పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, బీడీ, ఖైనీ, గుట్కా, పాన్ మసాలా, జరదా, సుపారి, హుక్కా, ఈ సిగరెట్, పొగాకు ఉత్పత్తులను ఉపయోగించరాదని రాష్ట్ర ఆరోగ్య విద్య, కుటుంబసంక్షేమశాఖ ప్రకటనలో కోరింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు రంగ కార్యాలయాలు, ప్రధాన ద్వారాల వద్ద పొగాకు రహిత జోన్ అంటూ బోర్డులను ఉంచాలని జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సింగ్ అధికారులను ఆదేశించారు.