న్యూఢిల్లీ : బొగ్గు గనుల కేటాయింపు కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శిక్షలు ఖరారు చేసింది. కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేతో పాటు మరో ఇద్దరు దోషులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ. 10 లక్షల జరిమానా కూడా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ భరత్ పరాశర్ తీర్పును వెల్లడించారు. 1999లో జార్ఖండ్‌లో బొగ్గు గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి. ఈ నెల 6న మాజీ మంత్రి దిలీప్ రేను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది.

అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రభుత్వంలో బొగ్గుగనుల సహాయ మంత్రిగా పనిచేసిన దిలీప్‌తోపాటు బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులు ప్రదీప్‌కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్, క్యాస్ట్రాన్ టెక్నాలజీస్ (సిటిఎల్) డైరెక్టర్ మహేంద్ర కుమార్ అగర్వాలా తదితరులకు కూడా జీవితఖైదు విధించాలని సీబీఐ ఈ నెల 14న కోర్టును కోరిన విషయం తెలిసిందే.