నెల్లూరు జిల్లా పరిషత్  చైర్ పర్సన్ గా శ్రీమతి ఆనం అరుణమ్మ పేరును ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు ప్రకటించారు.శనివారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ ప్రత్యేక సమావేశం కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో జిల్లా ఎన్నికల పరిశీలకులు శ్రీ బసంత కుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జడ్పి కోఆప్షన్ సభ్యులు గా శ్రీ అల్లాబక్షు,  శ్రీ తాజుద్దీన్ నామినేషన్లు వేశారని, పోటీ లేనందున ఇద్దరు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పేర్కొన్నారు. 46 మండలాల జడ్పిటిసి సభ్యులు, ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్  సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జడ్పీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక నిర్వహించారు. కావలి మండల జెడ్ పి టి సి జంపని రాఘవులు నెల్లూరు రూరల్ జెడ్ పి టి సి ఆనం అరుణమ్మ పేరును చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా పొదలకూరు మండలం జెడ్ పి టి సి తెనాలి నిర్మల బలపరిచారు. దీనికి సభ్యులు అందరూ మద్దతు తెలపగా ఆనం అరుణమ్మ జెడ్పి చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అనంతరం జడ్పీ వైస్ వైస్ చైర్మన్ గా  ఇందుకూరుపేట జడ్పిటిసి శ్రీహరికోట జయ లక్ష్మమ్మ, రాపూరు జడ్పిటిసి చిగురుపాటి ప్రసన్నను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం జెడ్పి చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లు ప్రమాణ స్వీకారం చేశారు.  అనంతరం ప్రిసైడింగ్ అధికారి, కలెక్టర్ జెడ్పి చైర్ పర్సన్,  వైస్ చైర్మన్లను అభినందించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మొదలైన ప్రమాణస్వీకార ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది.   జడ్పీ సీఈఓ శ్రీమతి సుశీల ఆధ్వర్యంలో అధికారులు పకడ్బందీగా  ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక ప్రక్రియ జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. నెల్లూరు టౌన్ డి.ఎస్.పి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా అడిషనల్ ఎస్పీ శ్రీమతి వెంకటరత్నం ఏర్పాట్లను పర్యవేక్షించారు . జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రముఖులు జిల్లా పరిషత్ నూతన పాలక వర్గానికి తమ అభినందనలు తెలుపుతూ పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి  శ్రీ అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీ గురుమూర్తి, శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి, శ్రీ మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు, శ్రీ కిలివేటి సంజీవయ్య, శాసనమండలి సభ్యులు శ్రీ వాకాటి నారాయణరెడ్డి, శ్రీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, శ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి తదితరులు హాజరయ్యారు.