షార్‌లో విస్తరణకే మొగ్గు 

రూ.400 కోట్లతో ఆధునికీకరణ పనులు

 రవి కిరణాలు, తిరుపతి జిల్లా, (సూళ్లూరుపేట) శ్రీహరికోట, :-

 భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో రెండో ప్రయోగ వేదిక విస్తరణపై దృష్టి సారించారు. ఇస్రో లక్ష్యాల్లో గగన్‌యాన్‌, చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 వంటి భారీ రాకెట్‌ ప్రయోగాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోగాలకు ప్రత్యేకమైన వేదిక అవసరం. ఇందుకు సుమారు రూ.3 వేల కోట్లకు పైగా నిధులు కావాలి. నిర్మాణానికి ఐదేళ్లకు పైగా సమయంపట్టే అవకాశం ఉంది. వీటన్నింటినీ బేరీజు వేసుకున్న ఇస్రో యంత్రాంగం గగన్‌యాన్‌ తదితర ప్రయోగాలను రెండో ప్రయోగ వేదిక నుంచి చేస్తేనే బాగుంటుందని యోచిస్తోంది. ఆమేరకు దానిని ఆధునికీకరించేలా రెండో ప్రయోగ వేదికలో మార్పులు చేస్తున్నారు. ఇందుకు రూ.400 కోట్ల వరకు ఖర్చుచేస్తే సరిపోతుందన్న అంచనాకు శాస్త్రవేత్తలు వచ్చారు.

ఆధునికీకరణ పనులు ఇలా.. 

ప్రస్తుతం జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3 వాహకనౌకలో ఎల్‌110 మోటార్లను ఉపయోగిస్తున్నారు. ఇకపై జరిగే ఎల్‌వీఎం, జీఎస్‌ఎల్‌వీ వాహకనౌకలకు సెమీ క్రయో సాంకేతికత ఉపయోగించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సెమీ క్రయో స్టోరేజ్‌తోపాటు అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు రూ.300 కోట్లు వెచ్చించనున్నారు. గగన్‌యాన్‌ ప్రయోగాలకు అవసరమైన పనులు బెంగళూరులోని ప్రాజెక్టు బాధ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇందుకు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండో ప్రయోగ వేదికలోనే మార్పులు చేస్తున్నామని షార్‌ ఉన్నతాధికారి రామస్వామి వెంకట్రామన్‌ వివరించారు.

తీరంలో రన్‌వే 

భవిష్యత్తులో షార్‌లో స్పేస్‌ షటిల్‌ ప్రయోగాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షార్‌లోని సముద్ర తీరంలో 3 నుంచి 4 కి.మీ రన్‌వే ఏర్పాటు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి వర్గాలు సాధ్యాసాధ్యాలను పరిశీలించాయి. రక్షణ శాఖకు సైతం ఉపయోగపడేలా రన్‌వేను నిర్మించనున్నారు.