రేపటి నుంచి స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభం..కరోనా వ్యాప్తి నేపథ్యంలో మూతబడిన పాఠశాలలు తిరిగి తెరుచుకునేందుకు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో..


అకడమిక్‌ క్యాలెండర్‌లోని ప్రధానాంశాలు:
  • అడ్మిషన్ల సందర్భంగా విద్యార్థులను పాఠశాలలకు రాకుండా చూడాలి. వారి తల్లిదండ్రులను మాత్రమే రప్పించాలి.
  • ప్రతి ఉపాధ్యాయుడు వారానికి ఒకసారి పాఠశాలకు రావాలి. వారు బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేయాల్సిన అవసరం లేదు.
  • ఉపాధ్యాయుడు తన తరగతి గదికి సంబంధించి విద్యార్థి వారీగా ప్రణాళికను రూపొందించుకోవాలి.
  • పాఠ్యాంశాలకు ఆన్‌లైన్‌ బోధన చేపట్టవచ్చు. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌లో సూచించిన పాఠ్యప్రణాళికకు మాత్రమే పరిమితమై ఉండాలి.
  • విద్యార్థులను మూడు విధాలుగా విభజించుకోవాలి. ఆన్‌లైన్‌ సౌకర్యాలు అందుబాటులో ఉన్న వారు(హైటెక్‌), రేడియో లేదా దూరదర్శన్‌ అందుబాటులో ఉన్న వారు(లోటెక్‌), కంప్యూటర్‌ గానీ మొబైల్‌ గానీ, రేడియో గానీ అందుబాటులో లేని వారు(నోటెక్‌).
  • గ్రామ, పట్టణాల్లో ఎటువంటి సమాచార, ప్రసార, కంప్యూటర్‌ సాధనాలు అందుబాటులో లేని వారిపైన దృష్టి పెట్టే విధంగా టీచర్‌ ప్రణాళికను తయారు చేసుకోవాలి.
  • 1 నుంచి 5వ తరగతి వరకూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 12 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లో చూపిన విధంగా కృత్యాలు చేయించాలి.
  • 6 నుంచి 8వ తరగతి వరకూ కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 4 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్‌లో చూపిన విధంగా ప్రాజెక్టు పనులు పిల్లల ద్వారా చేయించాలి.
  • 9, 10 తరగతులకు విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. ఆన్‌లైన్‌, రేడియోల ద్వారా శిక్షణ చేపట్టవచ్చు.
  • ప్రీ-ప్రైమరీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడానికి వీల్లేదు.
  • తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చుకోవడానికి టీసీ అడిగితే ప్రధానోపాధ్యాయుడు తప్పనిసరిగా అందించాలి.
  • వలస కుటుంబాల పిల్లల ప్రవేశాలకు ఐడెంటిటీ నిరూపణ తప్ప ఏ ధ్రువపత్రాలు అడగకూడదు.
  • స్థానికంగా విద్యావంతులైన యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి సేవలు వినియోగించుకోవచ్చు.
  • ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో కూడా వారానికి ఒకసారి హాజరు కావాలి. కానీ అందరూ ఒక్క రోజే హాజరుకావాల్సిన అవసరం లేదు. వారు ఏ రోజు హాజరు కావాలన్న విషయమై హెచ్‌ఎం ఉత్తర్వులివ్వాలి. ఇవి నాడు-నేడు పాఠశాలలకు కూడా వర్తిస్తాయి.
  • దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న వారు, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో నివసిస్తున్నవారు, శారీరక వైకల్యం కలిగినవారు, కంటైన్‌మెంట్‌ జోన్‌లలో పాఠశాలలు ఉన్న ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాల్సిన అవసరం లేదు.
  • కానీ తరగతి వారీగా, విద్యార్థి వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్‌లో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ ప్రణాళిక అమలు చేయాలి.
  • ప్రత్యామ్నాయ అకడమిక్‌ క్యాలెండర్‌లో సూచించిన విధంగా ప్రతి టీచర్‌ రోజూ కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి వారి పిల్లలు చేపట్టవలసిన విద్యా కార్యక్రమాల గురించి వివరించాలి.
  • మరుసటి రోజు నుంచి ఐదుగురు చొప్పున తల్లిదండ్రులకు మళ్లీ ఫోన్‌ చేసి వారి పిల్లల పురోగతి తెలుసుకోవాలి. ఆ విధంగా వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి.
  • టీచర్లు రోజు వారీ పనిని డైరీలో నమోదు చేసుకుని ప్రతి శనివారం ఫొటో రూపంలో గూగుల్‌ ఫారంలో అప్‌లోడ్‌ చేయాలి. ఆ వివరాలను సంబంధిత ఎమ్మార్వో, డిప్యూటీ ఈవో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.