మొలగొలుకుల వరి సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రైతు కొండారెడ్డి
మొలగొలుకుల వరి సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రైతు కొండారెడ్డి
జలదంకి, మేజర్ న్యూస్ :-
తాతలు తండ్రుల కాలం నుంచి సాగు చేస్తున్న 6 నెలల పంట మొలగోలుకుల వరిని సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు జలదంకి గ్రామానికి చెందిన రామాల కొండారెడ్డి. ఇటీవల కాలంలో వర్షాభావం, వేసిన పంటలు పండుతాయో లేదో అని, స్వల్పకాలిక రకాల వైపు(4 నెలలకే పంట చేతికొచ్చే వరి రకాలు) రైతులంతా మొగ్గు చూపుతుంటే ఈ రైతు మొలగోలుకులు సాగు చేయడమే కాక తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని తీస్తూ రైతులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో మొలగొలుకులు నారు పోయడం, ఆ తర్వాత నెలా పది రోజుల కల్లా పంట పొలంలో నాట్లు వేయడం, అతి తక్కువ మోతాదులో రసాయనిక ఎరువులు వినియోగించి పంటలు పండించడం ఈ రైతు ప్రత్యేకత. పురుగు మందులు అవసరమైతేనే పిచికారి చేస్తారు తప్ప, అందరి రైతుల వలె విచ్చలవిడిగా పురుగుమందులను వినియోగించకుండా పంటలు పండిస్తారు. వ్యవసాయ శాఖ ఏడిఏ రామిరెడ్డి శిష్యునిగా ,గతంలో జలదంకి మండలంలో ఆదర్శ రైతుగా పనిచేశారు. ప్రభుత్వం నుంచి ఆదర్శ రైతుగా అవార్డును పొందారు.శత్రు పురుగులు మిత్ర పురుగులు, ఏ నెలలో ఏ పంట విత్తుకోవాలి వంటి విషయాలను అవపాసన పట్టడమే కాక, వరి పైరు కానీ ఇతర ఏ పంటలైనా కానీ మొక్కను చూడగానే ఏ ఏ పోషకాల లోపం ఉంది, ఏమి వాడాలి వంటి విషయాలను ఇప్పటికీ స్థానిక రైతులకు తెలియజేస్తుంటారు. పలువురు రైతులకు కూడా ఈయన వద్దకు వచ్చి సలహాలు సూచనలను తెలుసుకొని పాటించి పంటలు పండిస్తున్నారు. ఆదర్శ రైతుగా ఉన్న సమయంలో పలువురు శాస్త్రవేత్తలతో ఆయన పంట పొలాలకు వెళ్లడం దాదాపు ప్రతి పంట లోను సాగు మెలుకువలు తెలుసుకోవడం జరిగింది.ఈ క్రమంలోనే నెల్లూరు మొలగోలుకులు వరి వంగడాన్ని సాగు చేసి పలు కుటుంబాలకు ఆ ధాన్యాన్ని ఇస్తూ ప్రతి సంవత్సరం ఆయా కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంలో తన పాత్ర పోషిస్తున్నారు.షుగర్ లెస్ దాన్యం 30 వేలు పుట్టి పలుకుతున్నా కూడా, తాను పండించిన ధాన్యాన్ని న్యాయమైన రేటుతో అందజేస్తున్నారు. మొలగొలుకుల బియ్యాన్ని అన్నం గా చేసుకొని తినటం వలన ఎక్కువ సమయం ఆకలి లేకుండా ఉండడంతో పాటు ఎంతో రుచిగా ఉంటుంది.షుగర్ పేషెంట్లు, కష్టం చేసుకునేవాళ్లు ఈ బియ్యం కోసం వెతుకులాడుతుంటారు. కారణం బియ్యం లో పోషకాలు ఉండడంతో పాటు ఎక్కువ సమయం ఆకలి వేయకపోవడమే.అయితే ఆరు నెలల కాలానికి పండే ఈ పంటను పండించాలంటే ఎంతో ఓపిక, శ్రద్ధ అవసరం.పండిన తర్వాత కూడా ఆ ధాన్యాన్ని సరైన తేమ వచ్చేవరకు ఆరబెట్టడం, గింజ నూక కాకుండా ఉండేలా తగిన జాగ్రత్తలతో ఆరబెట్టాల్సి ఉంటుంది. ఈ విషయంపై రైతు కొండారెడ్డిని అడగగా మొలవలుకులు రకాన్ని పండించి పలు కుటుంబాలకు అన్నం కొరకు అందించడంలో ఎంతో సంతృప్తి ఉంటుందన్నారు. రైతులంతా ఈ దిశగా పంటలు పండించి ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
వేసవి పంటగా గుమ్మడి సాగు.
వేసవి పంటగా తన పొలంలో గుమ్మడి పంట సాగు చేశారు. జలదంకి మండలంలో యెడ గారు పంట కింద పత్తి పంట సాగు చేయడం ఆనవాయితీ. పత్తికి మార్కెట్ ఉండదనే ముందు ఆలోచనతో కొండారెడ్డి రెండు ఎకరాల పొలంలో గుమ్మడి పంటను సాగు చేశారు. ఈ పంట అయితే పెట్టుబడి తక్కువ అవుతుందని, కాలం కలిసి వస్తే మంచి దిగుబడి వస్తుందని చెన్నై మార్కెట్లో గుమ్మడి కాయలకు మంచి డిమాండ్ ఉంటుందని కొండారెడ్డి అన్నారు. అంతేకాక దసరా పండుగకు గుమ్మడికాయలకు మంచి డిమాండ్ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం గుమ్మడి పంట వేసి 45 రోజులు అయిందని, పూత దశలో ఉందని అన్నారు.