పొదలకూరు లో నిర్మాణం చేపట్టిన ఏడేళ్లకు.... ప్రారంభానికి సిద్ధమైన ఏడుకొండలవాడి ఆలయం.... ఈ నెల 26న ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట.... రేపటి నుంచి 26 వరకు విగ్రహాల ప్రతిష్టా మహోత్సవ వేడుకలు....
వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి....
నిర్మాణ పనులు చేపట్టిన ఏడేళ్లకు ఏడుకొండలవాడి ఆలయం ప్రారంభానికి సిద్ధమైంది. భక్తుల విరాళాలతో చేపట్టిన ఏడుకొండల వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం ఏడేళ్ళ కాలంలో పూర్తి కావడం, ఏడేళ్లు దాటకముందే ప్రారంభానికి నోచుకోవడాన్ని భక్తులు విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ నెల 26వ తేదీన ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తో పాటు అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్ట త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా జరగనున్న సంగతి విదితమే. విగ్రహాల ప్రతిష్టలో భాగంగా రేపటి నుంచి 26వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ఉత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి,రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల దంపతులు పాల్గొననున్న సంగతి తెలిసిందే.
          పొదలకూరు పట్టణంలోని శ్రీనివాస నగర్ లేఔట్ లో 2015 సంవత్సరం జూన్ 11వ తేదీన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీ రామచంద్ర జీయర్ స్వామి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి, గోదాదేవి అమ్మవార్ల తో పాటు శ్రీ గరుడ ఆళ్వార్ స్వామి ఆలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయాల నిర్మాణం మొత్తం రాతితో చేపట్టారు. ఈ ఆలయాల నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 26న స్వామి, అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట కు ముహూర్తం నిర్ణయించారు. ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనకు ముందు నుంచే ఆ స్థలంలో బాలాలయాన్ని నిర్మించి స్వామి, అమ్మవార్లకు నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతివారం స్వామివారి పల్లకి సేవలు, ప్రతినెల శ్రవణా నక్షత్రం రోజున శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం స్వామివారికి పల్లకిసేవతోపాటు శుక్రవారం అమ్మవార్లకు అభిషేకాలు జరుపుతున్నారు. ఆలయ నిర్మాణ ప్రాంగణంలో ఇప్పటికి నాలుగు పర్యాయాలు సుదర్శన హోమం, మూడు సార్లు శ్రీ మహాలక్ష్మి యాగాలను నిర్వహించారు. ప్రతిఏటా ముక్కోటి ఏకాదశినాడు ఉత్తర ద్వారదర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఆ సందర్భంలో బాలాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. కరోనా కష్టకాలంలో పనులు లేని పేదలకు అన్నదానం చేశారు. ప్రతిరోజు సుమారు 500 నుంచి 600 మంది వరకు అన్నదానం జరిపారు. ఈ ఆలయ ప్రాంగణంలో 22 ఆవులతో గోశాల నిర్మించారు. ఏడేళ్లలో స్వామి, అమ్మవార్లు  ఎందరో భక్తుల కోరికలను తీర్చారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో తలనీలాలు సమర్పించుకుంటున్నారు. పాంచరాత్ర ఆగమంతో పూజలు నిర్వహిస్తున్నారు. చుట్టూ ఉన్న 8 మండలాలకు అష్టాదళ పద్మ కేంద్రంగా వున్న పొదలకూరు లో నిర్మాణం పూర్తి చేసుకుని, ఈ నెల 26 న ప్రారంభానికి సిద్ధమైన ఈ ఆలయం  తలమానికమై, ప్రముఖ దివ్య క్షేత్రంగా వెలుగొందనుంది.