ఎంపీలు, ఎమ్మెల్యేల సమన్వయంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి



- మంత్రులు ఆనం, నారాయణ

- ఎమ్మెల్యేలు, కలెక్టర్, జేసీతో ప్రత్యేక సమీక్ష

- త్వరలో జిల్లాకు రానున్న ఇరిగేషన్ మంత్రి దృష్టికి సోమశిల జలాశయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు

- హాజరైన ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, పాశం సునీల్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, కావ్య కృష్ణారెడ్డి 


నెల్లూరు, జులై 6 : ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల సమన్వయంతో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ పేర్కొన్నారు.


శనివారం ఉదయం చింతారెడ్డిపాలెంలోని మంత్రి నారాయణ క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ తో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. 


ఈ సమావేశానికి  ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, పాశం సునీల్ కుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ సమన్వయంతో కృషి చేస్తామన్నారు.  నియోజకవర్గాల్లోని సమస్యలపై  ఎమ్మెల్యేలతో చర్చించి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఒక అవగాహనకు వచ్చామన్నారు. 

 ఒక మంచి వాతావరణంలో ఎమ్మెల్యేలతో సమీక్ష జరిగిందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి వాతావరణం లోనే అందరం కలిసి జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన మొదలుపెట్టిందన్నారు.  జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, ఇదివరకే ఉన్న పరిశ్రమల్లో కల్పించాల్సిన మౌలిక వసతులపై ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ సేదు మాధవన్ తో చర్చించామన్నారు.   త్వరలో జిల్లాకు రాష్ట్ర జలవనుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని ఆహ్వానించామని, సోమశిల జలాశయంలో చేపట్టాల్సిన క్రస్ట్ గేట్ల మరమ్మత్తులు, ఆఫ్రాన్, రక్షణగోడ మొదలైన అభివృద్ధి పనులను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామన్నారు.


సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో  అభివృద్ధిని గాడిన పెట్టేందుకు చర్యలు చేపట్టామన్నారు. దగదర్తి ఎయిర్పోర్ట్, దువరాజపట్నం పోర్టు, కిసాన్ సెజ్, కృష్ణపట్నం టర్మినల్ మొదలైన అనేక పారిశ్రామిక సంస్థల ఏర్పాటు పై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు చెప్పారు.