ఓ వర్గం మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చి అమ్మకానికి..

'బుల్లీ బయ్‌' యాప్‌ నిర్వాహకుల అకృత్యం
పాత్రికేయురాలి ఫిర్యాదుతో వెలుగులోకి
ఆ యాప్‌ను బ్లాక్‌ చేసినట్లు ఐటీ మంత్రి వెల్లడి


దిల్లీ: నూతన సంవత్సర ఆరంభం రోజునే మహిళల ఆత్మగౌరవాన్ని ఆన్‌లైన్‌ వేలంలో పెట్టిన అకృత్యం వెలుగులోకి వచ్చింది.

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే వంద మందికిపైగా ముస్లిం మహిళల చిత్రాలను అభ్యంతరకర రీతిలో మార్చి ఓ యాప్‌లో వేలానికి ఉంచిన ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. 'బుల్లీ బయ్‌' పేరుతో ఉన్న ఆ యాప్‌లో తన ఫొటోను అమ్మకానికి ఉంచారంటూ ఓ ముస్లిం పాత్రికేయురాలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వెల్లడించడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. దీనిపై ఆమె దిల్లీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ముంబయి పోలీసులు కూడా దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రజలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. ఆ యాప్‌నకు హోస్టింగ్‌ సేవలు అందిస్తున్న గిట్‌హబ్‌ సంస్థ దాన్ని శనివారం ఉదయమే బ్లాక్‌ చేసిందని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ(ఐటీ) మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీసులు, కంప్యూటర్‌ ఎమర్జన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(సీఆర్‌ఈటీ) సంయుక్త దర్యాప్తు చేపట్టాయని ఆదివారం పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని, సంబంధిత సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా తమకు తెలియజేయాలని జాతీయ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు రేఖాశర్మ దిల్లీ పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. తద్వారా ఈ తరహా నేరం మరోటి జరగకుండా చూడాలన్నారు.

ఇది మరో 'డీల్స్‌'

గతేడాది జులైలో 'సుల్లీ డీల్స్‌' అనే యాప్‌లోనూ వందల మంది ముస్లిం మహిళల చిత్రాలను వేలానికి పెట్టడంపై పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ యాప్‌ను కూడా ఓపెన్‌ సోర్స్‌ హోస్టింగ్‌ వేదిక అయిన గిట్‌హబ్‌లోనే నడిపేవారు. దీనిపై దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లలో కేసులు నమోదవడంతో ఆ యాప్‌ను ఆన్‌లైన్‌ నుంచి తొలగించారు. కానీ ఇప్పటివరకూ దాని నిర్వాహకులను గుర్తించి శిక్షించడంలో పోలీసులు పురోగతి సాధించలేకపోయారు. ఇప్పుడు అదే తరహాలో 'బుల్లీ బయ్‌' యాప్‌లో ముస్లిం మహిళల ఫొటోలను వేలానికి ఉంచడం గమనార్హం. ఈ యాప్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది తదితరులు మండిపడ్డారు. ''ఓ వర్గం మహిళలను అవమానించే ఇలాంటి దుశ్చర్యలను అడ్డుకోవాలంటే మనందరం ఒక్కటై పోరాడాలి'' అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ''నేరస్థులకు శిక్షలు పడకపోవడం వల్లే వారు మితిమీరిపోతున్నారు'' అని ఒవైసీ ట్వీట్‌ చేశారు. ''బుల్లీ బయ్‌ యాప్‌ విషయాన్ని ముంబయి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. నేరస్థులను కఠినంగా శిక్షించాలి'' అని ప్రియాంకా చతుర్వేది డిమాండ్‌ చేశారు.