లోక్సభలో ప్రశ్నించిన నెల్లూరు ఎంపీ ఆదాల

దేశంలోని నగరాల్లో అక్రమ కాలనీలను కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో ప్రశ్నించారు. అక్రమ కాలనీల కట్టడికి తీసుకున్న చర్యలు  ఉదాహరించాలని కోరారు. దీనికి కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం రాతపూర్వకంగా జవాబు చెబుతూ దేశంలోని నగరాల్లో అక్రమ కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో స్థానిక సంస్థలు, అభివృద్ధి సంస్థలతో కలసి ఒక మాస్టర్ ప్లాన్ ను రూపొందించినట్లు పేర్కొన్నారు. నగరాల్లోని ఖాళీ ప్రదేశాల్లో అక్రమ కాలనీల ఏర్పాటు జరగకుండా ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డి డి ఎ) చేపట్టిన కొన్ని చర్యలను ఉదహరించారు. ప్రతి నెల ఖాళీ ప్రదేశాలను ఫోటోలను తీసి అప్లోడ్ చేస్తున్నట్టు తెలిపారు. ఖాళీ స్థలాల్లో ప్రహరీలు, కంచె ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరితగతిన స్పందించే టీమ్లను ఏర్పాటు చేసి ఆక్రమణలను గుర్తిస్తున్నట్లు తెలిపారు. స్థానికులతో నిఘా బృందాలను ఏర్పాటు చేసి చొరబాట్ల నివారణకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదాహరణకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఆక్రమణలను అరి కడుతున్నట్లు తెలిపారు.